99. కర్మను కాదు ద్వేషాన్ని త్యజించాలి
అజ్ఞానం వల్ల మనము ఆస్తులను , సంపదలను కూడబెట్టుకునే ప్రయత్నంలో ఉంటాము. తద్వారా కర్మబంధాలను పోగు చేసుకుంటూ ఉంటాము. అవగాహన యొక్క మొదటి కిరణం ప్రసరించాక పరిత్యాగం గురించి ఆలోచించటం మొదలు పెడతాము. ' దేన్ని త్యజించాలి ?' అనే విషయం మీద మనకు స్పష్టత ఉండదు. మన మనస్సుకు ఆయా పనులను మంచివి , చెడ్డవి అని నిరంతరము విభజించే లక్షణం ఉన్న కారణంగా మనం అవాంఛిత కర్మలను వదిలివేయడానికి సిద్ధమవుతాము. మరొకవైపు శ్రీకృష్ణుడు పరిత్యాగాన్ని గురించి విభిన్నమైన దృక్పథాన్ని అందిస్తూ , “ ఎవరినీ ద్వేషింపని , దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరుగవలెను. ఏలనన , రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించినవాడు అవలీలగా సంసారబంధముల నుంచి ముక్తుడగును” అని చెప్పారు (5.3). మనం మొదట విడిచి పెట్టాల్సింది ద్వేషం. ఇది మనము నమ్మే మత , కుల , జాతి పరమైన నమ్మకాలకు విరుద్ధంగా వెళ్లే దానిపట్ల ఉన్న ద్వేషం అయినా కావచ్చు. ద్వేషం ఒక వ్యక్తి పట్ల , ఒక వృత్తిపట్ల లేక మన చుట్టూ జరిగే అంశాల , పరిస్థితుల పట్ల కావచ్చు. కనిపించే వైరుధ్యాలలో ఏకత్వాన్ని చూడడం ప్రధానం. ఒక నిత్య సన్యాసి ద్వేషంతోపాటు కోరికలను కూడా త్యజిస్తాడు. ద్వ...