26. గులాబీ పద్మం కాలేదు
శ్రీకృష్ణుడు స్వధర్మాన్ని గురించి వివరించి (2.31-2.37) , ఒక క్షత్రియునిగా అది అతని స్వధర్మం కనుక అర్జునుడు యుద్ధం చేసేందుకు సంకోచించకూడదని చెబుతారు (2.31). శాశ్వతమైనది , అవ్యక్తమైనది , అన్నిటా వ్యాపించినది అయిన ' దాన్ని ' గురించి చెబుతూ శ్రీకృష్ణుడు భగవద్గీతను ప్రారంభిస్తారు. దానిని సులభంగా అర్థం చేసుకునేందుకు ఆత్మ అంటారు. ఆ తర్వాత ఆయన స్వధర్మాన్ని గురించి మాట్లాడతారు. ఆఖరికి కర్మ విషయానికి వస్తారు. అంతరాత్మ వైపు ప్రయాణాన్ని మూడు దశలుగా విభజించవచ్చు. మొదటిది మన ప్రస్తుత స్థితి ; రెండవది మన స్వధర్మాన్ని తెలుసుకోవడం ; మూడవది అంతరాత్మను చేరుకోవడం. మన ప్రస్తుత స్థితి మన స్వధర్మం , అనుభవాలు , జ్ఞానం , జ్ఞాపకాలు , ఊహలతో నిండియున్న చంచలమైన మనస్సు యొక్క సమ్మేళనం. ఈ సమ్మేళనము నుండి మనల్ని మనం విడిపించుకున్నప్పుడు స్వధర్మము నెమ్మదిగా స్పష్టమవుతుంది. క్షత్రియ అన్న పదంలో ' క్షత్ ' అంటే ' గాయము '; ' త్రయ ' అంటే ' రక్షణ ఇవ్వడం '. గాయాల నుంచి మనకు రక్షణనిచ్చేవాడే క్షత్రియుడు. గర్భంలో ఉన్నప్పటి నుండి పిల్లలు తమ కాళ్ళమీద తాము నిలబడే దాకా సంరక్షించే తల్లి...