23. ఆత్మ అవ్యక్తమైనది
శ్రీకృష్ణుడు
అర్జునుడితో “ఇది” (దేహి/ఆత్మ) అవ్యక్తమైనది, అనూహ్యమైనది, వికారరహిత మైనదని చెప్పి,
ఒకసారి దీని గురించి తెలుసుకుంటే భౌతిక శరీరం కోసం దుఃఖించ వలసిన
అవసరం లేదని అంటారు (2.25). పుట్టుకకు ముందు అన్ని జీవులు అవ్యక్తంగా ఉంటాయని,
పుట్టుకకు చావుకు మధ్య మాత్రమే వ్యక్తమవుతాయని, తిరిగి మరణించాక అవ్యక్త (అదృశ్య) మవుతాయని శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు
(2.28).
అనేక సంస్కృతులు
దీనిని వివరించడానికి సముద్రము, అలల ఉదాహరణను ఇస్తాయి. సముద్రం అవ్యక్తాన్ని సూచిస్తే, అల వ్యక్తాన్ని సూచిస్తుంది. సముద్రం నుంచి అనేక పరిమాణాలు, ఆకారాలు, తీవ్రతలతో కొంత కాలానికి మాత్రమే ఈ అలలు
వ్యక్తమవుతాయి. చివరికి అలలు అవి పుట్టిన సముద్రంలోనే కలిసిపోతాయి. వ్యక్తమయ్యే
అలలను మాత్రమే ఇంద్రియాలు గ్రహించగలవు.
అలాగే ఒక
విత్తనానికి చెట్టుగా వికసించే సామర్థ్యం ఉంటుంది. విత్తనంలో చెట్టు అవ్యక్త
రూపంలో దాగి ఉంటుంది. విత్తనము నుండి మొలక రావడం మొదలవగానే చెట్టు వ్యక్తమవుతుంది.
ఆ చెట్టు అనేక విత్తనాలను ఉత్పత్తి చేసి మరణిస్తుంది.
ఇంద్రియాలు తమ
పరిమితమైన సామర్థ్యంతో తెలుసుకోగల వాటిని 'వ్యక్తము' అంటాము. ఆధునిక యుగంలో మన
ఇంద్రియాల యొక్క సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి కొన్ని సాంకేతిక పరికరాలు కూడా
ఉన్నాయి. సూక్ష్మదర్శిని, దూరదర్శిని వంటివి కళ్ల యొక్క
సామర్థ్యాన్ని పెంచుతాయి. ఎక్స్ రే పరికరం వివిధ పౌనఃపున్యాల కాంతిలో వస్తువులను
చూసేందుకు కంటికి సహకరిస్తుంది.
“ఇది” (ఆత్మ)
అనూహ్యమైనదని శ్రీకృష్ణుడు అంటారు. అంటే సాంకేతిక పరికరాల సహాయంతో కూడా మన
ఇంద్రియాలు దాన్ని తెలుసుకోలేవు. మెదడు అనేక ఇంద్రియాల సమ్మేళనమే కనుక దానికి కూడా
అవ్యక్తాన్ని తెలుసుకునే సామర్థ్యం లేదు.
మన అందరి లాగానే
అర్జునుడు కూడా తన భౌతిక దేహంతో తనను గుర్తించుకుంటున్నాడు ఎందుకంటే అతనికి
అంతకుమించిన అనుభవము, అవగాహన
లేవు.
అవ్యక్తాన్ని
గురించిన జ్ఞానోదయం కలిగించి తద్వారా శ్రీకృష్ణుడు అర్జునుడి ఆలోచనల్లో మార్పు
తీసుకువచ్చే ప్రయత్నం చేస్తారు. అర్జునుడి వంటి మేధావికి ఇది అర్థం చేసుకోవడానికి
స్వయానా భగవానుడి అవసరం వచ్చింది. మనం దీనికి అతీతులం కాదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి