143. పనియే పూజ అయినప్పుడు
ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణుడిని మరణ సమయంలో తెలుసుకొనే సందర్భంలో , అయన అర్జునుడితో ఇలా అంటారు , " నీవు సర్వదా నన్నే స్మరించుచు ఉండుము (సర్వేషు-కాలేషు-అనుస్మర). యుద్ధమును కూడా చేయుము. నీ మనోబుద్ధులను నాయుందే నిల్పియున్నచో నిస్సందేహముగా నన్నే పొందెదవు" (8.7). రోజులో ఏదో ఒకసారో లేదా అప్పుడప్పుడు ప్రార్ధనా స్థలాలకు వెళ్లటం ద్వారా మనం దేవుడిని స్మరించుకుంటాము. వేర్వేరు విశ్వాసాలకు అనుగుణంగా మనం పూజించే దేవుళ్లు , పాటించే ఆచార వ్యవహారాలు వేరు కావచ్చు. మనకు ఎదురయ్యే కష్టాలను తొలగించుకోవటానికి మనం దేవుడిని స్మరించుకుంటూ ఉంటాము. మన కోరికలు నెరవేర్చుకోడానికి , అధికారం , పేరు ప్రతిష్టలు పొందడానికి భగవంతుడిని ప్రార్ధిస్తూ ఉంటాము. కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు ‘ఎల్ల వేళలా నన్ను స్మరించు ' అని ప్రబోధిస్తున్నారు. కానీ సర్వకాల సర్వావస్థలయందు భగవత్ సన్నిధానాన్ని ఆశ్రయించటం గురించి మనకు తిలియదు. ఈ సంక్లిష్టతకు సంబంధించిన మూలాలు భక్తియోగములో ఉన్నాయి. ఇది ' అన్ని జీవులలో తనను చూడడం ; తనలో అన్ని జీవులని చూస్తూ భగవంతుని ప్రతిచోటా చూడడం ' ( 6.29 & 6.30). ఈ అస్తిత్వగత సత్యాన్ని గ్రహి...