142. ముగింపుకు ముందు ప్రారంభించాలి

 

స్వీయ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మరణానికి ముందు పరమాత్ముడైన నిన్ను తెలుసుకోవటం ఎలాగా అని అర్జనుడు ప్రశ్నించాడు (8.2). ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ శ్రీకృష్ణ భగవానుడు ‘‘ఆత్మ శరీరాన్ని వదిలే ఆఖరి క్షణంలో ఎవరైతే నన్ను స్మరిస్తారో వారు నాలో లీనమవుతారు. ఇందులో ఏమాత్రము కుడా సందేహము లేదు" (8.5) అని చెప్పారు.

మరణ సమయంలో ఎవరైనా పరమాత్మను స్మరించితే ఆయనను పొందుతారనే నిశ్చయాత్మకమైన హామీ ఇది. జీవితాంతం సకల పాపాలకూ పాల్పడి, దానవుల మార్గాన్ని అనుసరించిన దుర్మార్గుడిలా ఉండి, భ్రాంతికి లోనయ్యి రకరకాల లాలసల కోసం తపన చెందిన వారు కూడా మరణశయ్యపై ఉన్నప్పుడు భగవంతుని స్మరించుకుంటే సరిపోతుంది అన్న అభిప్రాయానికి ఈ శ్లోకం తావిస్తుంది. ఇటువంటి పొరపాటు అభిప్రాయానికి తావు లేకుండా శ్రీకృష్ణుడు ‘‘జీవిత కాలంలో ఏ విధంగా మనిషి మనుగడ సాగించాడో ఆఖరి క్షణాల్లోనూ దాన్నే తల్చుకుంటాడు’’ అని స్పష్టం చేస్తున్నారు (8.6).

ముందుగా మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే మనం ఎప్పుడు మరణిస్తామో ఎవ్వరూ హామీ ఇవ్వలేరు. మరణం అన్నది ఎంత ఆకస్మిక సంఘటన అంటే ఫలానా సమయానికి మనం భగవన్నామ స్మరణలో ఉండొచ్చన్న ఆలోచన యొక్క ఆచరణ సాధ్యం కాదు. ఇక రెండో విషయం ఏమిటంటే సాధారణంగా మనము మార్పును ప్రతిఘటిస్తూ ఉంటాము. దుర్మార్గుడు సన్మార్గుడుగా మారటం లేదా రోజువారీ జీవితంలో సుఖభోగాల చుట్టూ తిరిగిన వాడు యోగిగా మారటం అనూహ్యమైన మార్పు. దాన్ని సాధించటానికి సమయం పడుతుంది. నిర్నిరోధమైన అంకిత భావంతో కూడిన ప్రయత్నం చేయాలి. మరణశయ్యపై ఉన్న వాడు అకస్మాత్తుగా మారలేడు. వృద్ధాప్యములో సహజంగా మనకు స్పష్టత కంటే గందరగోళమే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆఖరి క్షణం వరకూ వేచి చూసి అప్పుడు భగవన్నామ స్మరణ చేద్దామంటే  ఉపయోగం ఉండదు.

ఈ వివరణ సారం ఏమిటంటే పరమాత్మను చేరుకునే ప్రయత్నం జీవితం తొలినాళ్లలోనే మొదలు కావాలి. అనిశ్చితితో కూడిన ఆఖరి రోజుల వరకూ వేచి ఉండరాదు. ఇది ఓ రకంగా చూస్తే జీవితానికి, పనికి మధ్య సమతుల్యం పాటించటం లాంటిది. ఇప్పుడు తీవ్రంగా కష్టపడి తర్వాత ఎప్పుడో విశ్రాంతి పొందుదామంటే ఎలా సాధ్యం కాదో జీవితాంతం ఓ నడవడికతో ఉండి చివరి క్షణాల్లో భగవన్నామ స్మరణ చేసుకుందాం అంటే అది సాధ్యం కానిపనే.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

37. అదే అర్జునుడు అదే బాణం

140. కర్మ అంటే ఏమిటి

141. శక్తి, పదార్థాల పొందిక