5. జ్ఞాన, కర్మ, భక్తి యోగాలు
వివిధ వ్యక్తులకు వారి దృక్కోణాన్ని బట్టి భగవద్గీత భిన్నంగా కనిపిస్తుంది. ఆత్మజ్ఞానము పొందడానికి భగవద్గీత మూడు మార్గాలను ఉపదేశిస్తుంది - కర్మయోగము , సాంఖ్యయోగము మరియు భక్తియోగము. కర్మయోగము మనస్సు ఆధారితమైన వారికి అనువైనది. సాంఖ్యయోగము బుద్ధిపై , భక్తియోగము హృదయం పై ఆధారపడే వారికి అనుకూలమైనవి. నేటి ప్రపంచంలో అత్యధిక శాతం మనస్సు మీద ఆధారపడే వర్గానికి చెందుతారు. మనమేవో సంకెళ్ళతో బంధింపబడ్డామనీ , వాటిని తెంచుకునేందుకు చాలా కష్టపడి పని చేయాలన్న నమ్మకంపై ఆధారపడి ఇది పనుల దిశగా ప్రేరేపిస్తుంది. వీరితో ఏ విధమైన సంభాషణైనా ' ఇప్పుడు నేను ఏమి చేయాలి ' అన్న అంశంతో ముగుస్తుంది. ఈ దారి మనల్ని నిష్కామకర్మ , అంటే కోరికలు లేని , ఫలితము ఆశించని కర్మల వైపు నడిపిస్తుంది. సాంఖ్యయోగాన్ని జ్ఞానయోగం అని కూడా అంటారు. ఇక్కడ జ్ఞానం అంటే మనం సాధారణంగా ఉపయోగించే విజ్ఞానం కాదు ; ఇది కేవలం అవగాహన లేదా తెలుసుకోగలిగే సామర్థ్యం గురించి మాత్రమే. మనమేదో చీకటిగదిలో ఉన్నామని , ఏమి చేసినా కూడా ఈ అంధకారం పోదు గనక దాన్ని పారద్రోలడానికి ఒక దీపాన్ని వెలిగించాల్సిన అవసరం ఉంది అనేది దీని ఆరంభ బిందువు....