5. జ్ఞాన, కర్మ, భక్తి యోగాలు
వివిధ వ్యక్తులకు వారి దృక్కోణాన్ని బట్టి భగవద్గీత భిన్నంగా కనిపిస్తుంది. ఆత్మజ్ఞానము పొందడానికి భగవద్గీత మూడు మార్గాలను ఉపదేశిస్తుంది - కర్మయోగము, సాంఖ్యయోగము మరియు భక్తియోగము. కర్మయోగము మనస్సు ఆధారితమైన వారికి అనువైనది. సాంఖ్యయోగము బుద్ధిపై, భక్తియోగము హృదయం పై ఆధారపడే వారికి అనుకూలమైనవి.
నేటి ప్రపంచంలో
అత్యధిక శాతం మనస్సు మీద ఆధారపడే వర్గానికి చెందుతారు. మనమేవో సంకెళ్ళతో బంధింపబడ్డామనీ, వాటిని తెంచుకునేందుకు చాలా కష్టపడి
పని చేయాలన్న నమ్మకంపై ఆధారపడి ఇది పనుల దిశగా ప్రేరేపిస్తుంది. వీరితో ఏ విధమైన
సంభాషణైనా 'ఇప్పుడు నేను ఏమి చేయాలి' అన్న
అంశంతో ముగుస్తుంది. ఈ దారి మనల్ని నిష్కామకర్మ, అంటే
కోరికలు లేని, ఫలితము ఆశించని కర్మల వైపు నడిపిస్తుంది.
సాంఖ్యయోగాన్ని
జ్ఞానయోగం అని కూడా అంటారు. ఇక్కడ జ్ఞానం అంటే మనం సాధారణంగా ఉపయోగించే విజ్ఞానం
కాదు; ఇది కేవలం అవగాహన
లేదా తెలుసుకోగలిగే సామర్థ్యం గురించి మాత్రమే. మనమేదో చీకటిగదిలో ఉన్నామని,
ఏమి చేసినా కూడా ఈ అంధకారం పోదు గనక దాన్ని పారద్రోలడానికి ఒక
దీపాన్ని వెలిగించాల్సిన అవసరం ఉంది అనేది దీని ఆరంభ బిందువు. ఈ మార్గం మనకు కోరిక
లేదా ఎంపిక లేని అవగాహన ఇస్తుంది.
భక్తియోగం శరణాగతికి
సంబంధించినది. సముద్రంలోని అలతో వారు తమను పోల్చుకుంటారు. ఇక్కడ సర్వోత్కృష్టులైన
పరమాత్మే సముద్రం.
మొదట్లో ఈ మూడు
మార్గాల యొక్క భాష, అవగాహన
చాలా భిన్నంగా ఉంటుంది. అవగాహనను గురించిన మార్గాన్ని మనస్సు ఆధారిత వ్యక్తికి
చెప్పినట్లయితే అతడు అవగాహనను పొందడానికి ఏదైనా పని చెయ్యాలని వెతుకుతూ ఉంటాడు.
గమనార్ధము ఏమిటంటే ఈ
మూడు మార్గాలూ ఒకదానికొకటి భిన్నమైనవి కావు. రోజువారి జీవితములో మనము ఈ మూడు
మార్గాల యొక్క కలయికను అనుభూతి చెందుతాము. ఉదాహరణకు కర్మ, సాంఖ్య మార్గాలు కలిసినప్పుడు అన్ని
కర్మల యొక్క అంతిమ గమ్యం ఎండమావేనని మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం కర్మకు
అంటకుండా నాటకంలో పాత్రధారులు లాగా కర్మలను కొనసాగిస్తాము.
ఎలాగైతే 'ఎలక్ట్రాన్,' 'ప్రోటాన్',
'న్యూట్రాన్' అనే మూడు కణాల కలయిక వలన ఈ
విశ్వము నిర్మించబడినదో అలాగే, ఆధ్యాత్మిక ప్రపంచం ఈ మూడు మార్గాలు
యొక్క కలయిక.
ఈ మూడు మార్గాలు
అహంకార విముక్తమైన అంతరాత్మ అనే ఒకే గమ్యానికి చేరుస్తాయని శ్రీకృష్ణుడు
బోధిస్తారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి