46. ఏది మనది, ఏది కాదు?
“మోహమనెడి ఊబినుండి పూర్తిగా బయటబడినప్పుడే నీవు
వినిన, వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగములనుండి
వైరాగ్యము (నిర్వేదం) ను పొందగలవు” అని శ్రీకృష్ణుడు చెప్పారు (2.52). మనం మోహాన్ని అధిగమించినప్పుడు మన ఇంద్రియాల ద్వారా వచ్చే సమాచారం మనను తన
ఇష్టానుసారంగా ప్రభావితం చేసే శక్తిని కోల్పోతుంది. శ్రీకృష్ణుడు 'వినికిడి' ని ఉదాహరణగా ఎంచుకున్నారు ఎందుకంటే మనం
తరచుగా ప్రశంసలు, విమర్శలూ, చాడీలు,
పుకార్లు వంటి ఇతరుల మాటలచే ప్రభావితమవుతాము.
పదాల కొరత కారణంగా, అహంకారం
లాగే మోహమును వర్ణించడం కష్టం. ఏది మనది, ఏది కాదు అనే వాటి
మధ్య తేడాను గుర్తించలేకపోవడమే మోహం. అంటే వర్తమానంలో, భవిష్యత్తులో
భౌతిక ఆస్తులు మీద యాజమాన్య భావన. వాస్తవానికి మనం వీటికి యజమానులం కాము. మనం మనది
కాని దానిని అంటిపెట్టుకుని ఉండటానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనదైన ఆత్మను మనము
గుర్తు పట్టలేక పోతాము. శ్రీకృష్ణుడు ఈ దృగ్విషయాన్ని 'కలిలం'
లేదా ఆధ్యాత్మిక చీకటి అని పిలుస్తారు.
ఈ అంధకారాన్ని అధిగమించినప్పుడు మనం 'వైరాగ్యము' (నిర్వేదం) ను పొందుతామని శ్రీకృష్ణుడు
చెప్పారు. నిర్వేదం ఉదాసీనతగా వర్ణించబడినప్పటికీ ఇది అజ్ఞానం నుండి పుట్టిన
నిష్క్రియ లేదా ప్రతికూల ఉదాసీనత కాదు. ఇది అవగాహన, సజీవంగా
ఉన్న వర్తమానంలో ఉత్పన్నమయె ఉదాసీనత. ఇది ఆసక్తి లేదా నిర్లిప్తత కాదు; అనుబంధము లేదా ఎడబాటు కాదు, కానీ వీటన్నింటినీ
మించినది. ఇది తీర్పులు, విమర్శలు లేని క్రియాశీల అంగీకారం.
'ఇతరుల' పై ఆధారపడే
జీవితంలో మన ఆస్తులు, సామర్థ్యాలు, విజయాలు,
ప్రవర్తన, రూపాలు మొదలైనవాటికి ఇతరుల ఆమోదం,
ప్రశంసల కోసం మనం తహతహలాడతాము. మనం మోహాన్ని అధిగమించనంత వరకు ఈ
ఆహ్లాదకరమైన అనుభూతులను పొందడానికి జీవితాంతం కష్టపడతాము.
మనం అవగాహన, సమతుల్యమైన,
పొందికైన బుద్ధి ద్వారా మోహ రూప అంధకారాన్ని పారద్రోలితే వర్తమానంలో
కానీ, భవిష్యత్తులో గాని ఇంద్రియాలు మనపై ప్రభావం చూపే
సమర్ధతను కోల్పోయి మనకు బానిసలవుతాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి