141. శక్తి, పదార్థాల పొందిక
శక్తి మరియు
పదార్ధాల మధ్య పొందికే జీవితం. సృష్టి పురోగమన క్రమం శక్తితో మొదలై వివిధ దశల్లో
భౌతిక పదార్ధాలు ఉద్భవిస్తూ వచ్చాయి. అణువుల యొక్క కలయిక విభిన్న లక్షణాలతో ఉన్న అనేక
రకాల పదార్ధాలకు దారితీసింది. ఫలితంగా అనూహ్యమైన, వైవిధ్యభరితమైన ప్రపంచము సృష్టించబడినది. మన భౌతిక శరీరం అటువంటి
కోటానుకోట్ల భౌతిక పదార్ధ రూపాల్లో ఒకటి.
ఈ భౌతిక శరీరం తన మనుగడ కోసం ఆహారంపై ఆధారపడుతుంది. ఈ ఆహారమే శరీరానికి అవసరమైన
శక్తిని అందిస్తుంది. చెట్లకు సూర్యకాంతి యొక్క శక్తిని ఆహారంగా మార్చుకోవటం ఎలాగో
తెలుసు. జంతువులు తమ ఉనికి కోసం వృక్షాలు తయారు చేసే ఆహారంపై ఆధారపడతాయి. స్థూలంగా
చూస్తే ఈ సృష్టి అంతా పదార్థము మరియు శక్తి మధ్య పొందికే.
శ్రీకృష్ణ
పరమాత్ముడు ఏడో అధ్యాయంలో 29, 30 శ్లోకాల్లో ఉపయోగించే బ్రహ్మ, కర్మ, అధ్యాత్మ, అధిదైవం, అధిభూతం,
అధియజ్ఞం వంటి పదాలకు అర్థం తెలుసుకోవడానికి పై వివరణ సహాయ
పడుతుంది. వీటి గురించి అర్జునుడు తెలుసుకోగోరతాడు (8.1 & 8.2 శ్లోకాలు). అర్జునుడికి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్ముడు
‘‘కాలముతోపాటు నాశనం అయ్యేది అధిభూతం, పురము అంటే శరీరములో
శక్తి రూపములో ఉండే పురుషుడే అధిదైవం, ఈ శరీరంలో అంతర్యామిగా
ఉన్న నేనే అధియజ్ఞం" (8.4) అని వివరిస్తారు.
అధిభూతం అనేది
కాలక్రమేణా నశించిపోయే పదార్థం లేదా 'రూపం'; అధిదైవం శరీరంలోని 'నిరాకార'
శక్తి వంటిది; అధియజ్ఞం అనేది పదార్థం మరియు
శక్తి మధ్య పొందిక. ఇది దర్శకుడిగా ఈ నాటకాన్ని సాధ్యం
చేస్తుంది; శ్రీకృష్ణుడు ఆ దర్శకుడు.
‘‘విశ్వశక్తి యొక్క
త్యాగం లేక వేరు అవ్వడమే కర్మ’’ (భూత-భావ-ఉద్భవ-కరో విసర్గః) అని శ్రీకృష్ణ
పరమాత్ముడు వివరిస్తున్నారు. మనుగడకు అవసరమైన శక్తిని ఆవాహన చేసేది, ఆహ్వానించేదే కర్మ. ఆలా పొందిన శక్తి
ద్వారా జీవన రూపాలు తమ మనుగడను సాగిస్తూ ఉంటాయి. కర్మఫలం రూపంలో మనం చూసేదంతా ఈ
రెండిటి మధ్య పొందికే.
శ్రీకృష్ణపరమాత్ముడు ‘స్వభావమే ఆధ్యాత్మ’ అంటున్నారు. స్వభావం అంటే మన అంతర్లీన ప్రకృతి. ఉదాహరణకు నిశ్శబ్దం మన స్వభావం అయితే భాష అనేది అరువు తెచ్చుకొనేది. అంటే అరువు తెచ్చుకున్న విషయాలు, లక్షణాలను విడనాడిన తర్వాత మనలో మిగిలేది మన ‘స్వభావం’. జీవితంలో మనము నేర్చుకునే సామర్ధ్యాలు, నైపుణ్యాలు మన గుర్తింపులు అవకుండా జాగ్రత్త వహించడము; వాటి మీద ఆధారపడి ఇతరులతో పోల్చుకోకుండా ఉండడము.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి