2.జీవితంలోని వైరుధ్యాలు








అన్ని మార్గాలు ఒకే గమ్యానికి చేరతాయిఅన్నట్లుగా భగవద్గీతలో ఇవ్వబడిన అన్ని మార్గాలు మనల్ని ఆత్మజ్ఞానం వైపుకి నడిపిస్తాయి. కొన్ని మార్గాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నట్లుగా అనిపిస్తాయి. కానీ ఇదంతా ఒక వలయాకారం లాంటిది. ఏ మార్గములో ప్రయాణించినా కూడా ఒకే గమ్యానికి మనల్ని తీసుకుని వెళ్తాయి.

గీతోపదేశము వివిధ స్థాయిల్లో ఉన్నదన్న విషయాన్ని మనము ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు శ్రీకృష్ణుడు అర్జునుడి స్థాయికి వచ్చి బోధిస్తారు. కొన్నిసార్లు ఆయన పరమాత్మగా ప్రకటితమవుతారు. ప్రాథమిక దశలో ఈ రెండు స్థాయిలూ వేరువేరుగా కనిపిస్తాయి కనుక అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

గత శతాబ్దం ప్రారంభములో కాంతిని అర్థం చేసుకునేటప్పుడు శాస్త్రవేత్తలు కూడా ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మొదట కాంతికి తరంగ స్వభావం ఉందని నిరూపించారు. తర్వాత అది కణంలా ప్రవర్తిస్తుందని గుర్తించబడింది. ఈ రెండు సిద్ధాంతాలు ఒకదానికొకటి విరుద్ధం అయినప్పటికీ మనం ప్రతి క్షణం చూసే వెలుగు స్పష్టమైన వైరుధ్యాల కలయిక. జీవితం కూడా అలాంటిదే.

ఒకసారి ఒక ఏనుగు గ్రామంలోకి ప్రవేశించింది. కొంతమంది అంధులు దాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారు ఏనుగును తాకిన భాగాన్ని బట్టి, ఆ ఏనుగు ఎలా ఉంటుందో అని ఊహించుకున్నారు. తొండాన్ని తాకిన వాడు ఏనుగు పొడవైన, గరుగ్గా ఉన్న ప్రాణి అన్నాడు. ఏనుగు దంతాన్ని తాకినవాడు ఆ జంతువు రాతి లాగా గట్టిదన్నాడు. పొట్ట భాగాన్ని తాకినవాడు అది పెద్దగా, మెత్తగా ఉందన్నాడు. ఈ విధంగా వారి ఊహలు కొనసాగాయి.

నేడు ప్రపంచంలో మనం చూస్తున్న వ్యత్యాసాలు, విబేధాలన్నిటికీ కారణం ఒకే వాస్తవాన్ని అనేక దృక్పథాలతో చూడడం. నిజానికి ఇవేవీ ఏనుగును సమగ్రంగా వర్ణింపలేవు ఎందుకంటే ఇవన్నీ కలిపితేనే అసలైన ఏనుగు.

వ్యక్తులు, వస్తువులు, సంబంధాల పరంగా చూస్తే మన మానసిక స్థితి కూడా ఈ అంధుల పరిస్థితి కంటే భిన్నంగా లేదు. ఈ పాక్షిక అవగాహనే మనం ఎదుర్కునే అనేక సమస్యలకు మూలకారణం. పాక్షిక అవగాహన నుండి పరిపూర్ణ అవగాహన దిశగా సాగే ప్రయాణమే భగవద్గిత.

భగవద్గీతను ఆచరించటానికి మనం ఏ కొన్ని అడుగులు ముందుకేసినా, ఏ చిన్న ప్రయత్నాలు చేసినా ఆ మేరకు మన జీవితాలు సంతోషమయం అవుతాయనటంలో సందేహమే లేదు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

37. అదే అర్జునుడు అదే బాణం

140. కర్మ అంటే ఏమిటి

141. శక్తి, పదార్థాల పొందిక