143. పనియే పూజ అయినప్పుడు

 

ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణుడిని మరణ సమయంలో తెలుసుకొనే సందర్భంలో, అయన అర్జునుడితో ఇలా అంటారు, "నీవు సర్వదా నన్నే స్మరించుచు ఉండుము (సర్వేషు-కాలేషు-అనుస్మర). యుద్ధమును కూడా చేయుము. నీ మనోబుద్ధులను నాయుందే నిల్పియున్నచో నిస్సందేహముగా నన్నే పొందెదవు" (8.7).

రోజులో ఏదో ఒకసారో లేదా అప్పుడప్పుడు ప్రార్ధనా స్థలాలకు వెళ్లటం ద్వారా మనం దేవుడిని స్మరించుకుంటాము. వేర్వేరు విశ్వాసాలకు అనుగుణంగా మనం పూజించే దేవుళ్లు, పాటించే ఆచార వ్యవహారాలు వేరు కావచ్చు. మనకు ఎదురయ్యే కష్టాలను తొలగించుకోవటానికి మనం దేవుడిని స్మరించుకుంటూ ఉంటాము. మన కోరికలు నెరవేర్చుకోడానికి, అధికారం, పేరు ప్రతిష్టలు పొందడానికి భగవంతుడిని ప్రార్ధిస్తూ ఉంటాము. కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు ‘ఎల్ల వేళలా నన్ను స్మరించు' అని ప్రబోధిస్తున్నారు. కానీ సర్వకాల సర్వావస్థలయందు భగవత్‌ సన్నిధానాన్ని ఆశ్రయించటం గురించి మనకు తిలియదు.

ఈ సంక్లిష్టతకు సంబంధించిన మూలాలు భక్తియోగములో ఉన్నాయి. ఇది 'అన్ని జీవులలో తనను చూడడం; తనలో అన్ని జీవులని చూస్తూ భగవంతుని ప్రతిచోటా చూడడం' (6.29 & 6.30). ఈ అస్తిత్వగత సత్యాన్ని గ్రహించినప్పుడు సర్వత్రా భగవంతుడున్నాడని గుర్తించగలుగుతారు. సకల చరాచర జీవకోటి ఆ భగవంతుని అవతారమే అని తెలుసుకొగలినప్పుడు ఇది ఎల్లప్పుడూ ఆయనను స్మరించడం తప్ప మరొకటి కాదు. ఈ అవస్థలో చూసినది అందమైనదా లేదా హింసాత్మకమైనదా, మనము విన్నది పొగడ్తగానీ, విమర్శగానీ అయినా అవన్నీ ఆ పరమాత్మా యొక్క రూపాలు తప్ప మరేమీ కాదు.

ఒకసారి ఈ అవగాహన పెంపొందించుకుంటే, యుద్ధం చేయమనే శ్రీకృష్ణుడి సలహా సులభంగా అర్థమవుతుంది. మన ముందున్న కర్తవ్యాన్ని నిర్వహించాలన్నది శ్రీకృష్ణ పరమాత్ముడి ఆదేశం. ప్రస్తుత పరిస్థితులలో అర్జునుడికి  ముందున్న కర్తవ్యం కురుక్షేత్ర యుద్ధమే. యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు పరమాత్ముడిని స్మరించుకోవటం అర్జునుడికే కష్ట సాధ్యం అయినప్పుడు మనం అతీతులం కాదు కదా.

ఈ దశకు చేరుకోవడానికి ఒక ఆచరణాత్మక మార్గం ఏమిటంటే మన వృత్తిపరమైన లేదా వ్యక్తిగత జీవితంలో ఇతరుల యొక్క అభిప్రాయాన్ని ఓపికగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. వారు ఎదుర్కొంటున్న పరిస్థితులలో మనం కూడా వారిలాగే వ్యవహరించేవాళ్లమని అర్ధం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్రక్రియ మనకు తీర్పులను, విభజనలను, వ్యత్యాసాలను వదిలిపెట్టి ఏకత్వాన్ని పొంది ప్రతి పనిని పూజ వలె నిర్వహించడానికి సహాయపడుతుంది.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

37. అదే అర్జునుడు అదే బాణం

140. కర్మ అంటే ఏమిటి

141. శక్తి, పదార్థాల పొందిక