135. యోగ మాయ
తన సాధారణ స్వభావం (అపరా ప్రకృతి) వ్యక్తీకరించబడుతుంది, అత్యున్నత స్వభావం (పరా ప్రకృతి) జీవన తత్త్వము అయిన అవ్యక్త రూపం అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పారు. త్రిగుణాల కారణంగా జనించే యోగ మాయ ఈ పరా ప్రకృతిని, అపరా ప్రకృతిని వేరు చేస్తుంది. దీని వలన జనన మరణాలు లేని వాడిగా (7.25), భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి అవగాహన కలిగిన ఆ పరమాత్మను గురించి మనము తెలుసుకో లేకపోతున్నామని (7.26) శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు.
యోగ మాయ అద్దాలతో పూర్తిగా
నిండిన గదిలాంటిది. ఎటు తిరిగి చూసినా మనమే కనిపిస్తాము. ఆ అద్దాల వెనక ఏముందో
తెలుసుకోవటం అసాధ్యమవుతుంది. ఈ అసమర్ధత కారణంగా ప్రతి ఒక్కరి వెనకా ఉన్న జీవన
తత్త్వాన్ని గుర్తించలేకపోతాము. ఇటువంటి అవగాహన మూర్ఖపు అవగాహన అని శ్రీకృష్ణుడు చెప్తున్నారు (7.24).
ఇది దానవుల మార్గం, పరమాత్మ పట్ల నిర్లక్ష్యంతో మనిషి-మనిషి
మధ్య పరస్పర చర్య తప్ప మరొకటి కాదు (7.15).
అధిక వోల్టేజీ దశ
నుండి తక్కువ వోల్టేజీ దశకు విద్యుత్తు ప్రయాణిస్తూ మార్గమధ్యంలో అనేక సాధనాలకు శక్తినిస్తుంది, కాంతివంతం చేస్తుంది. పరమాత్మను
అనంతమైన వోల్టేజ్ బిందువుగా తీసుకుంటే ఈ శక్తి ప్రవాహం శ్రద్ధ అనే కేబుల్ ద్వారా
మనం పొందే ఆశీర్వాదాలు తప్ప మరొకటి కాదు. ఇది కోరికలను నెరవేర్చడంలో మనకు
సహాయపడుతుంది. దీనిని మనిషి-పరమాత్మ మధ్య పరస్పర చర్య అని పిలవవచ్చు.
రెండు పాయింట్లు ఒకే
వోల్టేజీని కలిగి ఉన్నప్పుడు అది సమత్వ స్థితిగా చెప్పవచ్చు. దానినే శ్రీకృష్ణుడు 'నేను 'జ్ఞాని'ని నాలాగే పరిగణిస్తాను' అని చెబుతున్నారు. అటువంటి
జ్ఞానీ యుక్తాత్ముడై నన్నే పరమ ప్రాప్యునిగా భావించి, నాయుందే
స్థితుడైయుండును (7.18). సర్వం వాసుదేవుడే అని గ్రహించి
నన్నే చేరుకుంటాడు. అటువంటి గొప్ప ఆత్మను కనుగొనడం కష్టం (7.19). జ్ఞాని పరమాత్మ
యొక్క ఆశీర్వాదాలను ఉపయోగించి 'యోగ మాయ'ను అధిగమించి, అంతా వాసుదేవుడే అని గ్రహించి ఆనందమయ
జీవనాన్ని గడుపుతాడు.
సాధారణంగా, భౌతిక ప్రపంచంలో మన లక్ష్యాలు
ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవటం చుట్టూ తిరుగుతుంటాయి. ఒక ఉప్పు బొమ్మ కరిగి సముద్రం అయినట్లు
పరమాత్మను చేరుకునే లక్ష్యంలో మనము వాటితో అనుబంధాలను, విరక్తిని
మరియు ద్వేషాన్ని వదిలివేయాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి