73. సమర్పణ కళ



అంతర్యామిని, పరమాత్మను ఐన నాయందే నీ చిత్తమును ఉంచి, కర్మలనన్నింటినీ నాకే అర్పించి, జ్వరం, ఆశా మమతలను వీడి యుద్ధము చేయుము” అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించారు (3.30). ఈ శ్లోకం భగవద్గీత యొక్క సారాంశం. ఇది మన రోజువారీ జీవితంలో అన్ని సందేహాలకు సమాధానం ఇస్తుంది.

మన మొదటి సందేహం 'ఏమి చెయ్యాలి' అనేది. సామాన్యంగా మనం చేసే పనిలో మనకు సంతృప్తి లేకపోవటం వలన ఇంకేదో పనిలో సుఖం ఉంటుందని మనకు అనిపిస్తుంది. కానీ ఈ శ్లోకం 'చేతిలో ఉన్న పనిని చేయమని' సలహా ఇస్తుంది. ఆ పని మనం కోరుకున్నది కావచ్చు లేదా మనకు ఈ ప్రకృతి ద్వారా కేటాయింపబడినది కావచ్చు. అది కురుక్షేత్ర యుద్ధం వలె ఒకరినొకరు చంపుకునే అంత క్రూరమైనది, సంక్లిష్టమైనది కావచ్చు. శాస్త్రీయంగా మన సంక్లిష్ట మానవ శరీరం ఒక కణం నుండి పరిణామం చెందింది. ఇక్కడ ప్రతి కర్మ (mutation) మునుపటి దానితో ముడిపడి ఉంటుంది అంటే మన చేతిలో ఉన్న ఏ కర్మ అయినా గత కర్మల శృంఖలాల ఫలితంగా ఉంటుంది. గత కర్మల గురించి మనము చేయగలిగినది ఏమీ లేదు కాబట్టి మన చేతిలో ఉన్న పనిని నిర్వహించాలి.

తదుపరి ప్రశ్న 'మన చేతిలో ఉన్న పని ఎలా చేయాలి'. అహంకారాన్ని, కోరికలను వదలి పని చేయమని ఈ శ్లోకము మనకు సలహా ఇస్తుంది. అర్జునుడి విషాదము వలన వచ్చిన వేదన వంటి జ్వరాలను కూడా వదిలేయాలని చెబుతుంది. కోరికలు వదిలేయడంతోనే మనకు దుఃఖం నుండి విముక్తి కలుగుతుంది ఎందుకంటే కోరికలు, దుఃఖం ఎల్లప్పుడూ కలిసే ఉంటాయి.

'మనకు ఎదురయ్యే అడ్డంకులను ఎలా అధిగమించాలి' అన్న ప్రశ్నకు భగవానుడైన శ్రీకృష్ణుడు అన్ని చర్యలను, బాధలను ఆయనపై విడిచిపెట్టమని సలహా ఇచ్చారు. చేతిలో ఉన్న పని సంక్లిష్టమైనది అయినప్పుడు మనం మనకంటే ఎక్కువ తెలిసినవారినుండి, అదనపు వనరులను కలిగి ఉన్నవారి నుండి సహకారం కోరుకుంటాము. ఆ సహకారం అనుభవపరంగా గాని జ్ఞానపరంగా గాని అవ్వచ్చు. మన అందరి పరిధికి మించిన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు మనల్ని ఆ పరమ శక్తిమంతుడైన పరమాత్మునికి సమర్పించుకోవడమే ఉత్తమము. అదే మోక్షము.

అహంకారం బలహీనతకు, భయానికి సంకేతం. దాని అస్తిత్వం కోసం సంపదలు, గుర్తింపును కోరుతుంది. ఈ అహంకారాన్ని దాటి పరమాత్మ పై సర్వస్వాన్ని విడిచిపెట్టడానికి ధైర్యం, నిర్భయత అవసరం.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

37. అదే అర్జునుడు అదే బాణం

140. కర్మ అంటే ఏమిటి

141. శక్తి, పదార్థాల పొందిక