134. తనతో తన పోటీ
తనను కొలిచే వారిలో నాలుగు రకాల భక్తులు ఉంటారని
శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పారు. తమ కష్టాలు తొలగించాలని ప్రార్ధించేవారు (ఆర్తులు),
సుఖసంపదులను చేకూర్చమని ప్రార్ధించేవారు (అర్థార్ధులు), జ్ఞానం ప్రసాదించమని ప్రార్ధించేవారు (జిజ్ఞాషులు), జ్ఞానులు
(7.16). ఇక్కడ జ్ఞానిని గురించి వివరిస్తూ శ్రీకృష్ణుడు తదేక ధ్యానంలో నిమగ్నమైన
నిత్యయుక్తుడైన జ్ఞాని ఈ భక్తులందిరిలో శ్రేష్ఠుడు అని చెప్పారు. అటువంటి జ్ఞానులు
తనకు ప్రియమైనవారని, వారికి నేను ప్రియమైనవాడినని చెబుతారు
(7.17). అనేక జన్మల చివరిలో అటువంటి వ్యక్తి జ్ఞానాన్ని పొంది నన్ను చేరుకుంటాడు
(7.19) అని చెప్పారు.
'అనేక జన్మలు' అనగా మనం
జ్ఞానిగా మారడానికి అనేక జన్మలు ఎత్తాలని సాధారణంగా భావిస్తాము. అయితే దీనికి
కారణం ఏమీ లేదు. మన భౌతిక శరీరం యొక్క జన్మకు పరిమితము కాకుండా 'జన్మ'ని సాధారణ పదంగా తీసుకోవడం ద్వారా మరింత
స్పష్టత వస్తుంది. ఈ జన్మ మన చుట్టూ ఉన్న పరిస్థితుల యొక్క 'జన్మ'
కావచ్చు. ఇది నిరంతర ప్రక్రియ. ఇవి
అనుకూలమైనవి లేదా బాధాకరమైన పరిస్థితులు కావచ్చు. కానీ
అవన్నీ మనకు బోధించగల, నేర్పించగల సామర్థ్యాన్ని కలిగి
ఉంటాయి. ఈ పరిస్థితులతో ముడిపడి ఉండకుండా లేదా విరక్తిని పెంచుకోకుండా మనం ఎంత
త్వరగా నేర్చుకుంటామో అనే దాని మీద మన ప్రగతి ఆధారపడి ఉంటుంది.
సాష్టాంగపడటం ద్వారా, ప్రశ్నించడం
ద్వారా, సేవ చేయటం ద్వారా నేర్చుకోవటం గురించి గతంలో
శ్రీకృష్ణుడు వివరించారు (4.34). ఈ మూడు సాధనాలు మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు,
మన జీవితంలోని వ్యక్తుల కోసం, మనం ఉన్న
పరిస్థితుల కోసం ఉపయోగించవచ్చు. శ్రద్ధతో ఈ సాధనాలను ఉపయోగిస్తే ప్రతి ఒక్క స్థితి
మనకు గురువు కావచ్చు. ఇది అహంకారాన్ని త్యజించి మెరుగైన అవగాహన పొంది నిన్నటి కంటే
ఈ రోజును మెరుగుపరచుకోవడము, ఈ రోజు కంటే రేపటిని ఇంకా మెరుగు
చేయడం. ఇతరులతో పోల్చడం విడనాడి తనతో తాను పోటీ పడుతూ ఉండాలి.
ఈ ప్రయత్నమే మనకు శాశ్వతమైన మోక్షాన్ని
ప్రసాదిస్తుంది. అటువంటి స్థితికి చేరిన జ్ఞానికి తెలుసుకోవటానికి ఏమీ మిగలదు.
మంచి, చెడు పరిస్థితులన్నీ అతనికి ఆనందకరమైన నాటకాల లాగా
మారిపోతాయి. అటువంటి స్థితిని చేరుకోవటానికి ప్రయత్నించే బాధ్యత మన మీదే ఉంటుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి