11. దుఃఖం సుఖాన్ని అనుసరిస్తుంది

 




ద్వంద్వాతీతం అంటే ద్వంద్వాలను, విరుద్ధ భావాలను అధిగమించడం. భగవద్గీతలో ఉన్న మరొక అమోఘమైన  ఉపాయం ద్వంద్వాతీతు-డవడం. అర్జునుడిని ఈ స్థితికి చేరమని చెబుతూ శ్రీకృష్ణుడు వేర్వేరు సందర్భాలలో సలహాలను ఇస్తారు.

సుఖాన్ని పొందడానికి మనం చిత్తశుద్ధితో కష్టపడి పని చేసినా కూడా బాధ, దుఃఖం మనకు ఎలా కలుగుతాయి?’ అన్నది మనందరికీ అర్ధము కానీ విషయం. సమాధానాల కోసం మన లోపల వెతికే బదులు మన ప్రయత్నాలు సరిపోలేబట్టి మనం సుఖాన్ని పొందలేకపోయామని మనల్ని మనమే సమాధాన పరచుకుంటాము. కానీ ఆశతో కూడుకున్న అహంకారం సుఖాన్ని పొందడం కోసం తిరిగి మనం ఇదే ప్రక్రియను మొదలు పెట్టేలా ప్రేరేపిస్తుంది. ఇలా జీవితాంతం కొనసాగుతుంది. ద్వంద్వాతీతము అన్న దాన్ని అర్థం చేసుకోవడమే ఈ ప్రశ్నకు సమాధానం.

వ్యక్తమయ్యే ప్రపంచంలో ప్రతిదీ దాని విరుద్ధ ధృవంతో (ద్వంద్వం) పాటే ఉనికిని కలిగి ఉంటుంది. పుట్టుకకు వ్యతిరేక ధృవం చావు; సుఖానికి దుఃఖం; గెలుపుకి ఓటమి; లాభానికి నష్టం; కలయికకు విడిపోవడం; పొగడ్తకు విమర్శ; షరతులతో కూడిన ప్రేమకు ద్వేషం; ఇలా ఈ జాబితా అనంతంగా సాగుతూనే ఉంటుంది.

ఇక్కడ నియమం ఏమిటంటే, మనం వీటిలో ఏదైనా ఒక దాని వెంట పడుతూ ఉంటే దాని విరుద్ధ ధృవం దానంతటదే మనల్ని అనుసరిస్తుంది. ఒక కర్రని మనం ఒక వైపు నుంచి ఎత్తినప్పుడు రెండవ కొస కూడా పైకి లేస్తుంది కదా? లోలకాన్ని లేదా ఉయ్యాలను మరొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అది ఒక వైపు వెళితే అనివార్యంగా మరొక వైపు కూడా రావలసిందే.

ఈ ధృవ సిద్ధాంతం ప్రకారం, కోవిడ్-19 వంటి ఇబ్బందికరమైన పరిస్థితులే మెరుగైన విజ్ఞానశాస్త్రం, టెక్నాలజీ ద్వారా మనకు సుఖాన్ని తీసుకురాగలిగాయని చరిత్ర చెబుతోంది. కోవిడ్-19 వంటి విషాద ధ్రువాలు అంతరాత్మ వైపు ప్రయాణాన్ని వేగవంతం చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ ద్వంద్వాలను మనము అధిగమించాలని బోధిస్తున్నారు. ఉదాహరణకు వర్తమానంలో జీవించటమే గతాన్ని, భవిష్యత్తును అధిగమించడం; షరతులతో కూడిన ప్రేమను, ద్వేషాన్ని అధిగమించి షరతులు లేని ప్రేమను మనలో సాధించడం.

ఈ ధృవాల గురించి అవగాహనతో ఉంటూ, వాటి మధ్య ఊగుతూ ఉన్నప్పుడు వాటిని గమనించదమే మన కర్తవ్యం. మన జీవిత కాలంలో ఈ ధృవాలకు లోను కావడం సహజం. ధ్రువాల గురించి అవగాహన వీటిని అధిగమించేందుకు మనకు సహాయపడుతుంది.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

37. అదే అర్జునుడు అదే బాణం

140. కర్మ అంటే ఏమిటి

141. శక్తి, పదార్థాల పొందిక