6. ఉద్దేశాన్ని గుర్తించండి

 




 

భగవద్గీత ఆంతరంగిక ప్రపంచంలో సమత్వాన్ని, సద్భావనను పెంపొందించుకోవడం కోసమైతే, చట్టం బయటి ప్రపంచంలో న్యాయ వ్యవస్థను నిలబెట్టడం కోసం ఉపయోగపడుతుంది. ఏ కర్మకైనా రెండు భాగాలు ఉంటాయి, ఒకటి ఉద్దేశం, రెండోది అమలు చేయడం. చట్టం ఆధారిత ప్రపంచంలో, నేరపరిభాషలో లాటిన్ పదాలను ఉపయోగించి వీటిని 'మెన్స్ రియా మరియు ఆక్టస్ రియస్' అని అంటారు.

ఉదాహరణకు ఒక సర్జన్ మరియు హంతకుడు ఇద్దరూ పొట్టను కోయడానికి చాకును ఉపయోగిస్తారు. ఇక్కడ సర్జన్ ఉద్దేశం కాపాడడం, చికిత్స చేయడం అయితే హంతకుడి ఉద్దేశం హాని చేయడం, చంపడం. రెండు పరిస్థితుల్లోనూ మరణం సంభవించవచ్చు, కానీ వారి ఉద్దేశాలు ఒకదానికి ఒకటి విరుద్ధమైనవి.

చట్టం పరిస్థితులను బట్టి మారుతుంది కానీ భగవద్గీత శాశ్వతమైనది. రోడ్డుకు ఎడమ పక్కన కారు నడపడం ఒక దేశంలో చట్టబద్ధమైనది కానీ మరొక దేశంలో నేరంగా పరిగణించబడవచ్చు. చట్టం పనులను మంచి పని లేదా చెడు పనిగా విభజిస్తుంది కానీ జీవితంలో మనకు అనేక సందేహాస్పదమైన పరిస్థితులు ఎదురవుతాయి.

మనము పన్నులు కడుతూ ఉన్నంతవరకు (ఆక్టస్ రియస్) అది ఇష్టంతో కట్టామా లేదా కష్టంతో కట్టామా (మెన్స్ రియా) అన్న దానితో చట్టానికి సంబంధం లేదు. ఆయా దేశం యొక్క చట్టం నిర్వచించే పరిమితులలో మనం ఉన్నంత వరకూ చట్టం మనజోలికి రాదు. ఎవరైనా నేరం చేయాలని ఆలోచిస్తూ ఉన్నట్లయితే దానికి చట్టం అడ్డురాదు కానీ భగవద్గీత అటువంటి ఆలోచనల్ని కూడా నిర్మూలించాలని చెబుతుంది.

మొక్కై వంగనిది మానై వంగదు అన్నట్లు 'ఉద్దేశం' దశలో ఉన్న కర్మను గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని, లేని యెడల మన ఆధీనము దాటిపోతుందని భగవద్గీత బోధిస్తుంది. ఉద్దేశాన్ని అమలు చేయడం అనేది భవిష్యత్తులో జరుగుతుంది కనుక దాని మీద మనకు ఎటువంటి నియంత్రణ ఉండదు.

చట్టం యొక్క దృష్టి అమలు చేయడం మీద ఉన్నప్పటికీ సమకాలీన నైతిక సాహిత్యం మనం మంచి, ఉదాత్తమైన ఉద్దేశాలను కలిగి ఉండాలని ఉద్భోదిస్తుంది. ఉద్దేశం మంచిదయినా లేక చెడ్డదయినా అది విజయంతో లేక అపజయంతో కలిసినప్పుడు అహంకారమైనా పెంపొందుతుంది లేదా బలహీనమైన క్షణంలో లావా లాగా పెల్లుబికే నిరాశ, నిస్పృహ మనసులో పేరుకుంటుంది. ఈ రెండు రకాల పరిస్థితులు మన అంతరాత్మ నుంచి మనల్ని దూరం చేస్తాయి.

అందుకే, అన్ని రకాల ఉద్దేశాలను అధిగమించడానికి భగవద్గీత మనకు సహాయం చేస్తుంది. కేవలం మన ఉద్దేశాలను గమనించడం ద్వారా మనం వాటన్నింటినీ అధిగమించి అంతరాత్మను చేరగలుగుతాము.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

37. అదే అర్జునుడు అదే బాణం

140. కర్మ అంటే ఏమిటి

141. శక్తి, పదార్థాల పొందిక