17. నాలుగు రకాల భక్తులు




శ్రీకృష్ణుడు నాలుగు రకాల భక్తులు ఉంటారని అంటారు.

మొదటిరకం వారు, జీవితంలో వారు ఎదుర్కొంటున్న కష్టాలు, దుఃఖం నుంచి బయటపడాలని కోరుకుంటారు. రెండవవారు భౌతిక ఆస్తులు, ప్రాపంచిక సుఖాలను పొందాలని కోరుకుంటారు. చాలా మంది భక్తులు ఈ రెండు వర్గాలకు చెందుతారు.

ఈ రెండు రకాల భక్తులూ వివిధ దేవతలను ప్రార్ధిస్తూ అనేక రకాల పూజలు, ప్రార్ధనలను చేస్తూ ఉంటారని శ్రీకృష్ణుడు చెప్తారు. రోగాన్ని బట్టి సంబంధిత వైద్యుడిని సంప్రదించడం వంటిదే ఇది. వారికి ఉన్న శ్రద్ధ వలన ఇటువంటి భక్తుల కోరికలు తీరతాయని శ్రీకృష్ణుడు అంటారు. ఇది సంక్షిప్తంగా ఒక రకమైన శరణాగతి. దిగువ ఉదాహరణ శ్రద్ధను గురించి చెబుతుంది.

ప్రక్క ప్రక్కన పొలాలు ఉన్న ఇద్దరు రైతులు సాగు కోసం ఒక బావిని తవ్వాలని నిర్ణయించుకుంటారు. మొదటి రైతు ఒకటి రెండు రోజులు ఒక చోట తవ్వి నీరు పడకపోవడంతో మరొక ప్రదేశంలో కొత్తగా తవ్వడం మొదలు పెడతాడు. రెండవ రైతు ఒకే ప్రదేశంలో తవ్వుతూ పోతాడు. ఒక నెల గడిచేసరికి మొదటి రైతు పొలమంతా గోతులతో నిండిపోయింది. రెండవ రైతు తన బావిలో నీటిని పొందుతాడు. మన ఇంద్రియాలకు ఏమీ కనిపించకపోయినా (ఈ ఉదాహరణలో నీరు), మనలో ఉన్న శ్రద్ధ మనకు దారి చూపిస్తుంది. శ్రద్ధ సందేహములేని నిర్భయమైన శక్తి, సందేహాలకు తావులేని స్థితి.

ఫలితాలనిచ్చే శ్రద్ధ వెనుక తానుంటానని శ్రీకృష్ణుడు సూచిస్తున్నారు. అందువలనే మన అనుబంధాల్లో, కుటుంబంలో, వృత్తిలో మనం చూపే శ్రద్ధకు అద్భుతాలు చేసే శక్తి ఉంది.

మూడో రకం భక్తుడు ఈ కోరికల హద్దులను దాటబోతూ ఉంటాడు. అతను ఉత్సుకతతో కూడి ఆత్మజ్ఞానాన్ని కోరుకుంటాడు. నాలుగో రకం వారు జ్ఞాని. ఆయన కోరికల హద్దులను అధిగమించి ఉంటారు. ఆయన అన్నిటా, అంతటా సర్వశక్తిమంతుడైన భగవంతుడినే చూస్తూ భగవంతునితో ఏకత్వాన్ని పొంది ఉంటారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

37. అదే అర్జునుడు అదే బాణం

140. కర్మ అంటే ఏమిటి

141. శక్తి, పదార్థాల పొందిక