18. సత్యము, అసత్యము




'సత్యము' (వాస్తవమైనది, శాశ్వతమైనది) నశించదని, 'అసత్యము' (అవాస్తవమైనది, అశాశ్వతమైనది) కు ఎన్నడూ ఉనికి లేదని శ్రీకృష్ణుడు చెబుతారు. జ్ఞాని మాత్రమే ఈ రెండింటి మధ్య తేడాని గమనించగలరు (2.16).

'సత్యము', 'అసత్యము' యొక్క చిక్కుముడులను అర్థం చేసుకోవడానికి అనేక సంస్కృతులలో తాడు, పాముల యొక్క భ్రాంతికి సంబంధించిన కథ ఉదహరించబడుతుంది. సంధ్యవేళ ఒక మనిషి ఇంటికి చేరుకొని గుమ్మంలో ఒక పాము లాగా చుట్టుకుని ఉన్న వస్తువును చూస్తాడు. నిజానికి అది పిల్లలు వదిలివేసిన తాడు; మసకగా ఉండడం వల్ల పాములా కనిపించింది. ఇక్కడ తాడు 'సత్యము' ను, పాము 'అసత్యము' ను సూచిస్తుంది. అతడు 'సత్యము' ను అంటే తాడును గుర్తించే వరకూ తాను ఊహించుకున్న 'అసత్యము' అంటే పాముని ఎదుర్కోడానికి అనేక వ్యూహాలను వేచే అవకాశం ఉంది. అతడు దానిపై కర్రతో దాడి చేయవచ్చు లేదా పారిపోవచ్చు లేదా నిజాన్ని తెలుసుకోవడానికి ఒక దీపాన్ని/టార్చ్ ను వెలిగించవచ్చు. మన అవగాహన అసత్యము మీద ఆధారపడినప్పుడు అత్యుత్తమమైన వ్యూహాలు, నైపుణ్యాలు కూడా నిష్ఫలం అవుతాయి.

ఇక్కడ 'తాడు' లేకుండా 'పాము' అనే ఊహకు అవకాశం లేదు అంటే సత్యము నుంచి అసత్యము తన ఉనికిని పొందుతుంది. అందువలనే పీడకల వచ్చినప్పుడు మన శరీరానికి నిద్రలో చెమట పట్టినట్లు అవాస్తవమైన కల కూడా మనల్ని ప్రభావితం చేయగలదు.

ఏదైతే గతంలో లేదో, భవిష్యత్తులో ఉండదో అదే 'అసత్యము' అని శ్రీకృష్ణుడు సూచించారు. ఇంద్రియాల ద్వారా మనకు కలిగే సుఖాన్ని ఉదాహరణగా తీసుకుంటే అది అంతకు ముందు లేదు; కాసేపటి తర్వాత ఉండదు. దుఃఖం విషయంలో, అన్ని ద్వంద్వాల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. 'అసత్యము' ఒక కాలపరిమితి వరకే ఉంటుందని 'సత్యము' శాశ్వతమైనదని మనం గుర్తించాలి.

'సత్యము' అనేది శాశ్వతమైన మన అంతరాత్మ అయితే 'అసత్యము' అనేది మన అహంకారం. అది అంతరాత్మ మద్దతుతో తన మనుగడను సాగిస్తుంది. మన అంతరాత్మను (తాడును) మనం గుర్తించినప్పుడు, అహంకారం (పాము) దానికదే మాయమవుతుంది.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

37. అదే అర్జునుడు అదే బాణం

140. కర్మ అంటే ఏమిటి

141. శక్తి, పదార్థాల పొందిక