29. సంతులనమే పరమానందం
భగవద్గీత సారాన్నంతా
శ్లోకం 2.38 సంగ్రహిస్తుంది. సుఖదుఃఖాలను,
లాభనష్టాలను, జయాపజయాలను సమానంగా భావించి
యుద్ధం చేసినా పాపం అంటదని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెబుతారు. ఈ సంతులనాన్ని
యుద్ధ సందర్భాలలోనే కాక ఇతర కర్మల విషయంలో కూడా అన్వయించుకోవచ్చు.
మన కర్మలన్నీ
ప్రేరేపితమైనవని, ఈ ప్రేరణ
కర్మను అపవిత్రం లేదా పాపమయం చేస్తుందని ఈ శ్లోకం చెబుతుంది. సుఖం, లాభం లేక విజయం వంటి వాటి నుండి ప్రేరణ పొందకుండా కర్మను ఎలాగ చేయడమొ మనకు
తెలీదు. అలాగే మనం చేసే కర్మలు దుఃఖం, నష్టం లేక అపజయాన్ని
తప్పించుకోవడానికి చేసేవే.
సాంఖ్య, కర్మయోగాల దృక్కోణం నుండి గమనిస్తే
ప్రతి కర్మను మూడు భాగాలుగా విభజించవచ్చు; కర్త, కర్మ, కర్మఫలం. శ్రీకృష్ణుడు కర్మఫలాన్ని సుఖం-దుఃఖం,
లాభం-నష్టం, విజయం-అపజయం గా విభజించారు.
సంతులనం
సాధించడానికి కర్త, కర్మ మరియు
కర్మఫలాలను వేరు చేయాలని శ్రీకృష్ణుడు
ఉపదేశిస్తున్నారు. దీనికి ఒక మార్గం కర్త అన్న భావనను విడనాడి తను కేవలం ఒక
సాక్షిని మాత్రమే అన్న అవగాహన పెంపొందించుకోవడం. జీవితమనే జగన్నాటకంలో మనం పోషించే
పాత్ర చాలా చిన్నదనే అవగాహన కలగాలి. మరొక మార్గం కర్మఫలాలపై మనకు ఎటువంటి హక్కు
లేదని గుర్తించడం. కర్మఫలము మన ప్రయత్నాలే కాక అనేక కారకాల సమ్మేళనమని గ్రహించడం.
కర్తృత్వాన్ని లేక
కర్మఫలాలను విడనాడే మార్గాలు అనుసంధానమై ఉంటాయి కనుక ఒకదానిలో ప్రగతిని సాధిస్తే
రెండవ దానిలో ప్రగతి దానంతటదే వస్తుంది.
కర్మ విషయానికి
వస్తే, మనం ఎవరమూ ఈ
భూమ్మీద అడుగుపెట్టక ముందే అది ఉన్నది. దాన్ని సొంతం చేసుకోలేము లేక ఫలితాలను
నియంత్రించలేము.
ఈ శ్లోకాన్ని
భక్తియోగ కోణం నుంచి కూడా చూడవచ్చు. భక్తియోగంలో భావమే సర్వస్వంగా ఉంటుంది.
శ్రీకృష్ణుడు కర్మ కంటే భావానికి ప్రాధాన్యతను ఇస్తారు. ఈ అంతర్గత శరణాగతి సమతుల్యాన్ని
తీసుకువస్తుంది.
తన దృక్పధాన్ని
బట్టి ఎవరికి వారు తమ మార్గాన్ని ఎంచుకోవచ్చు. దృష్టికోణం ఏదైనా ఈ శ్లోకాన్ని
ధ్యానించడం ద్వారా అహంకారం నుండి విముక్తులై అంతరాత్మను చేరుకోగలరు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి