40. కర్తృత్వ భావనను విడనాడడం

 



యోగ స్థితుడవై ఆసక్తిని వీడి, సిద్ధి-అసిద్దుల యెడ సమత్వ భావమును కలిగియుండి కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఈ సమత్వ భావమునే యోగమందురు” అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించారు (2.48). మరో మాటలో చెప్పాలంటే మనల్ని మనం ద్వంద్వాలతో గుర్తించుకోవడం మానేసినప్పుడు మనం ఏమి చేసినా సమంజసంగా ఉంటుంది.

మన రోజువారీ జీవితంలో అనేక నిర్ణయాలు తీసుకుంటాము, ఎంపికలు చేస్తూ ఉంటాము. నిరంతరం నిర్ణయాలు తీసుకునే మనస్సు అందుబాటులో ఉన్న వికల్పాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటుంది. శ్రీకృష్ణుడు ఈ వికల్పాలను సుఖం/దుఃఖం, లాభం/నష్టం, గెలుపు/ఓటమి మరియు విజయం/వైఫల్యంగా వర్గీకరిస్తారు (2.38).

'సమత్వం' అనేది పరస్పర విరుద్ధ ధృవాలను సమానంగా పరిగణించడం. దీనిని సాధారణంగా ద్వంద్వాలను అధిగమించడమని పిలుస్తారు. ఈ అవగాహన లోతుగా నాటుకున్నప్పుడు మనస్సు శక్తిహీనమై ఎంపిక లేని అవగాహనను పొందుతుంది. మనం నిద్రలో లేదా మత్తులో ఉన్నప్పుడు విభజన చేసే, నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని కోల్పోతాము. మనకు సామర్థ్యం ఉన్నప్పటికీ విభజన చెయ్యకుండా ఉండగలగడమే సమత్వ స్థితిని సాధించడం. ఇది కేవలం పరిశీలకుడిగా ఉంటూ వర్తమానంలో జీవించడం.

కర్మ చేస్తున్నప్పుడు సమస్థితిని పొందేందుకు ఆచరణాత్మక మార్గం ఏమిటంటే కర్తృత్వ భావనను వదిలి సాక్షిగా మారడం. ఇది పూర్తి తీవ్రత, నిబద్ధత, అంకితభావం, సమర్థత, అభిరుచితో నాటకంలోని నటించడం లాంటిది. అంటే ఉన్న పరిస్థితుల్లో శాయశక్తులా మన ప్రయత్నం చేయడం. అదేవిధంగా జీవితమనే గొప్ప వేదికపై మనకు ఇచ్చిన పాత్రలను పూర్తి అంకితభావంతో పోషించాలి. ఇది కొడుకు కూతురు, భార్య/భర్త, తల్లిదండ్రులు, స్నేహితుడు, ఉద్యోగి, యజమాని, సహోద్యోగి, సూపర్‌వైజర్ మొదలైన పాత్రలు కావచ్చు. గమనార్హము ఏమిటంటే ఒక రోజులో మనం అనేక విభిన్న పాత్రలను ధరిస్తాము; ప్రతి ఒక్క పాత్రను పోషిస్తున్నప్పుడు మన వంతు అత్యున్నత కృషి చేయాలి. మనం నాటకంలో కేవలం ఒక పాత్రను మాత్రమే ధరిస్తున్నామనే పూర్తి అవగాహనతో ఉండాలి.

జీవితంలో మనకు లభించిన అన్ని పాత్రలలో కొంత కాలం పాటు దీన్ని ఆచరించడం ప్రారంభించవచ్చు. తద్వారా ఇది మనలో తెచ్చే సామరస్యాన్ని మనంతట మనమే గమనించవచ్చు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

37. అదే అర్జునుడు అదే బాణం

140. కర్మ అంటే ఏమిటి

141. శక్తి, పదార్థాల పొందిక