47. స్థిరమైన బుద్ధి



మన జీవిత గమనంలో ఒకే విషయం పై విరుద్ధమైన అభిప్రాయాలను విన్నప్పుడు మనం కలవరపడతాము. ఇవి వార్తలు, తత్వశాస్త్రం, ఇతరుల అనుభవాలు, నమ్మకాలు ఏమైనా కావచ్చు. వివిధ అభిప్రాయాలను విన్నప్పటికీ మన బుద్ధి నిశ్చలంగా (చలించకుండా), సమాధిలో స్థిరంగా ఉన్నప్పుడు మనం యోగాన్ని పొందుతామని శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు (2.53).

ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి చెట్టు సరైన ఉదాహరణ. దాని పైభాగం కనిపిస్తుంది; క్రింది భాగం వేళ్ల మూల వ్యవస్థతో కూడి అదృశ్యంగా ఉంటుంది. పైభాగం గాలుల బలానికి ఊగుతుంది, కానీ ఈ గాలుల వల్ల వేళ్ల వ్యవస్థ ప్రభావితం కాదు. పైభాగం బాహ్య శక్తులకు ఊగిసలాడుతున్నప్పుడు క్రింది భాగం సమాధి స్థితిలో నిశ్చలంగా, స్థిరంగా ఉండడంతో పాటు పోషకాహారాన్ని అందించే తన బాధ్యతను నిర్వహిస్తుంది. బాహ్యభాగం ఊగిసలాడుతున్నప్పటికీ అంతర్గతంగా నిశ్చలంగా ఉండటమే చెట్టుకు యోగస్థితి.

అజ్ఞాన స్థాయిలో మనకున్న చంచల బుద్ధి బాహ్య ఉత్తేజనలకు ప్రభావితమై దానంతటదే ఊగిసలాడుతుంది. ఈ ఉగిసలాట తాత్కాలిక స్పందనలు, ఉద్వేగాలు, కోపాలతో కూడిన మన ప్రవర్తన ద్వారా జీవితాలను సమస్యాత్మకం చేస్తాయి. మన వ్యక్తిగత జీవితాలనే కాక మన కుటుంబ సభ్యుల జీవితాలను, మన సహుద్యోగుల జీవితాలను కూడా సమస్యాత్మకంగా మారుస్తాయి. కొందరు జీవిత అనుభవాలను ఎదుర్కొని తదుపరి స్థాయికి వెళ్లి ఈ ఊగిసలాటలను దాగివేయడానికి, అణిచివేతకు పాల్పబడతారు. వారు ముఖానికో ముసుగు తొడుక్కుని మంచి ప్రవర్తన చూపించడానికి అలవాటు పడతారు. ఈ స్థితిలో ఈ కంపనాలు వారి లోపలే ఉంటాయి. కానీ ధైర్యంగా, ఆహ్లాదకరంగా ఉన్నట్లు ప్రవర్తించడం నేర్చుకుంటారు. ఈ ప్రవర్తన ఎక్కువ కాలం నడవదు.

ఎటువంటి ఊగిసలాటలకు తావులేని సమాధి స్థితిలో నిశ్చలముగా ఉండడం గురించి శ్రీకృష్ణుడు ఈ శ్లోకములో ఉద్ఘాటించారు. మరో మాటలో చెప్పాలంటే ఈ బాహ్య ఊగిసలాటలు అనిత్యమైనవని తెలుసుకుని సమాధిలో నిశ్చలంగా ఉన్న అంతరాత్మను చేరుకోవడం (2.14).


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

37. అదే అర్జునుడు అదే బాణం

140. కర్మ అంటే ఏమిటి

141. శక్తి, పదార్థాల పొందిక