50. రాగం, భయం, క్రోధం
"దుఃఖములకు
కృంగిపోనివాడును, సుఖములకు
పొంగిపోని వాడును, రాగము, భయము,
క్రోధము లేని వాడిని స్థితప్రజ్ఞుడు అందురు” అని శ్రీకృష్ణుడు
చెప్పారు (2.56). సుఖం-దుఃఖం, లాభం-నష్టం; విజయం-అపజయాలను సమానంగా భావించమని శ్రీకృష్ణుడు చెప్పిన ఉపదేశానికి ఇది
కొనసాగింపు (2.38).
మనమందరం సుఖాన్ని
కోరుకుంటాము కానీ దుఃఖం అనివార్యంగా మన జీవితాల్లోకి వస్తుంది. ఎందుకంటే ఇవి రెండూ
ఎల్లప్పుడూ జంటలుగా ఉంటాయి. ఇది ఎర వెనుక కొక్కెం దాగి ఉన్న చేపల ఎర లాంటిది.
స్థితప్రజ్ఞుడు అంటే
ఈ సుఖ-దుఃఖ ధ్రువాలను అధిగమించి ద్వంద్వాతీతుడైన వాడు. మనము సుఖాన్ని
ఆశిస్తున్నప్పుడు వేరే ఆకారంలో లేక కొంత సమయం గడిచిన తర్వాత దాని విపరీత ధ్రువం
అయిన దుఃఖం మనల్ని అనుసరిస్తుందన్న అవగాహన.
మన ప్రయత్నాలతో
సుఖాన్ని పొందినప్పుడు మనము ఉత్తేజితులు అవడముతో అహంకారం ఉప్పొంగిపోతుంది. అయితే
అది దుఃఖరూపమైన ఉద్రేకంగా మారినప్పుడు అహంకారం గాయపడుతుంది. ఇది నిస్సందేహముగా
అహంకారం యొక్క ఆట అని సూచిస్తుంది. స్థితప్రజ్ఞుడు దానిని గ్రహించి అహంకారాన్నే
వదిలివేస్తాడు.
శ్రీకృష్ణుడు 'స్థితప్రజ్ఞుడు రాగం నుండి విముక్తి
పొందాడని' చెప్పినప్పుడు స్థితప్రజ్ఞుడు వైరాగ్యం వైపు
ఆకర్షితులవుతారని అర్ధం కాదు. వారు ఈ రెండింటినీ అధిగమించిన స్థితికి చేరుకుంటారు.
ఈ విషయాన్ని మనం అర్ధం చేసుకోవడం కష్టం ఎందుకంటే ధృవాలను అధిగమించిన స్థితిని
వర్ణించడానికి భాషల్లో తగిన పదాలు లేవు.
భయం, క్రోధం నుండి స్థితప్రజ్ఞులు విముక్తి
పొందారంటే వారు వాటిని అణిచివేస్తారని అర్థం కాదు. భయం, క్రోధాలు
తమలో ప్రవేశించడానికి, తాత్కాలికంగా లేదా శాశ్వతంగా అవి తమలో
ఉండడానికి వారు చోటు ఇవ్వరు.
భయం, క్రోధం అనేవి భవిష్యత్తు గురించి ఆందోళన లేక గడిచిన కాలము యొక్క గాయాలను గుర్తు తెచ్చుకోవడం. గమనించదగ్గ విషయం ఏమిటంటే వర్తమానంలో ఈ రెండింటికీ చోటు లేదు. స్థితప్రజ్ఞులు భయం, క్రోధం నుండి విముక్తి పొందారని శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు వారు వర్తమానంలోనే జీవించడాన్ని సూచిస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి