56. ఆధ్యాత్మికతలో కారణం, ప్రభావం



మనఃప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నియును నశించును. ప్రసన్నచిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ది అన్ని విషయముల నుండి వైదొలగి, పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరమగును” అని శ్రీకృష్ణుడు చెప్పారు (2.65).

మన కోరికలన్నీ తీరిన తర్వాత మనం సంతుష్టి చెంది సుఖాన్ని పొందుతాము, దుఃఖాన్ని తొలగించుకుంటామని మనం భావిస్తుంటాము. కానీ శ్రీకృష్ణుడు మనల్ని మొదట సంతుష్టి చెందమని మిగిలినవి వాటంతటవే అనుసరిస్తాయని చెప్తున్నారు.

ఉదాహరణకు, మనకు జ్వరం, నొప్పులు మొదలైన లక్షణాలు ఉంటే మనం ఆరోగ్యంగా లేమని నిర్ధారిస్తాము. ఈ లక్షణాల మూల కారణాలకు చికిత్స చేయకుండా వీటిని అణచివేయడం వల్ల మన ఆరోగ్యం కుదుటపడదు. మరోవైపు పోషకాహారం, మంచి నిద్ర, వ్యాయామము మొదలైనవి మనకు మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి.

అదే విధంగా దుఃఖములో భాగమైన భయం, క్రోధం, ద్వేషం అనేవి మనలో సంతృప్తి లేకపోవడాన్ని సూచిస్తాయి. వాటిని కృత్రిమంగా అణచివేయడం మూలంగా మనము సంతృప్తిని పొందజాలము.

క్రోధము, ద్వేషాన్ని అణిచివేసి సమాజంలో ఆమోదయోగ్యమైన ప్రవర్తనను ప్రదర్శించడానికి అనేక చిట్కాలు బోధించబడ్డాయి; ప్రస్తుత కాలంలో ఆచరణలో కూడా ఉన్నాయి. కానీ ఈ లక్షణాలను అణచివేస్తే కొంత సేపటి తర్వాత మరింత శక్తితో అవి తిరిగి వస్తాయి. ఉదాహరణకు బాస్ పై అణచి పెట్టుకున్న కోపం తరచుగా క్రింది ఉద్యోగులు లేదా కుటుంబ సభ్యులపై వ్యక్తమవుతుంది.

ఈ ప్రపంచం యొక్క ద్వంద్వ స్వభావం గురించి తెలుసుకోవడం; కర్మఫలం ఆశించకుండా కర్మను ఆచరించాలనే అవగాహన; త్రిగుణాలే మన కర్మలు, ఆలోచనలు, భావాలకు అసలైన కర్త; మనం కేవలం సాక్షి మాత్రమేనని తెలుసుకోవడమే తృప్తి యొక్క మార్గము.

మన నిజ స్వరూపమైన, అవ్యక్తమైన అంతరాత్మ ఎల్లప్పుడూ సంతుష్టిగానే ఉంటుంది. కానీ తాడు-పాము ఉదాహరణలో సాదృశ్యమైన పాముని చూసినట్లు, వ్యక్తమయ్యే దానితో మనల్ని మనం జత చేసుకుని అసంతృప్తికి లోనవుతాము.

దుఃఖాల నుండి విముక్తి పొందడానికి శ్రీకృష్ణుడు మనల్ని ఆత్మవానుడు, ఆత్మారమణుడు అంటే ఆత్మతో తాదాత్మ్యం చెందమని సూచిస్తున్నారు (2.45). ఇది దుఃఖాల యొక్క అణచివేత లేదా అభివ్యక్తి కాదు. వాటిని సాక్షిగా చూస్తూ ఉండేందుకు సమర్థులవ్వడం.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

37. అదే అర్జునుడు అదే బాణం

140. కర్మ అంటే ఏమిటి

141. శక్తి, పదార్థాల పొందిక