64. సర్వోత్తమమైన కృషి చేయండి
“నీవు
శాస్త్రవిహిత కర్తవ్యకర్మలను ఆచరింపుము. ఏలనన కర్మలను చేయకుండుట కంటెను చేయుటయే
ఉత్తమము. కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణముగూడా సాధ్యము గాదు” అని
శ్రీకృష్ణుడు తత్వాన్ని విశదీకరించారు (3.8).
ఆహారాన్ని సేకరించడం, భోజనం చేయడం వంటి చర్యలు మానవ శరీరం
యొక్క మనుగడకు అవసరం. మానవ శరీరం అనేక అవయవాలు, వ్యవస్థలు,
రసాయనాలను కలిగి ఉంటుంది. ఇవి క్రమం తప్పకుండా వేలాది అంతర్గత
చర్యలను చేస్తూ ఉంటాయి. వాటిలో ఏ ఒక్కటి తప్పిపోయినా సామరస్యం పోయి, శరీరం రోగగ్రస్తమవుతుంది లేదా నశిస్తుంది. అంటే శరీరం యొక్క నిర్వహణ
నిష్క్రియాత్మకంగా సాధ్యం కాదు.
శ్రీకృష్ణుడు నియత
చర్యలను గురించి మాట్లాడారు. ఇది ఒక క్లిష్టమైన తత్వ జ్ఞానము. సమాజం మనపై విధించిన
కట్టుబాట్లు, పవిత్ర
గ్రంథాల ద్వారా ప్రస్తుతింపబడిన ఆచారాలు లేదా విధులు సాధారణంగా నియత కార్యాలుగా
పరిగణించబడతాయి. కానీ శ్రీకృష్ణుడు చెప్పే దాన్ని నిర్వచించడంలో ఈ రెండూనూ
విఫలమవుతాయి.
చిన్న విత్తనం
విశాలమైన చెట్టుగా మారినట్లు, చిన్న కణం జన్యువులలో (జీన్స్) ఉన్న సూచనలను అమలు చేయడం ద్వారా
సంక్లిష్టమైన మానవ శరీరంగా అభివృద్ధి చెందినట్లు ఈ భౌతిక ప్రపంచంలో అత్యున్నత
సామర్థ్యాన్ని సాధించడమే మన బాధ్యత. కణాల కోసం జన్యువులలోని సూచనల వలె మనలోని
ప్రతి ఒక్కరి కర్మ మన గుణాలచే ఎంపిక చేయబడుతుందని అర్ధం చేసుకోవాలి. అందువల్ల,
ఈ సూచనలను అమలు చేస్తున్నప్పుడు 'నేను’ మాయమై 'చేయడం' మాత్రమే మిగిలి
ఉంటుంది. ఇందులో పెరగడం, మనల్ని మనం రక్షించుకోవడం, ఇతరులకు సేవలు చేయడం వంటివి ఉంటాయి.
ఇది మన పూర్తి
సామర్ధ్యాలతో సర్వోత్తమమైన కృషి చేయడం. ఇది మనం 'ఏమి చేస్తున్నాము' అనే దాని గురించి
కాదు. ఏ పనినైనా మనం ఎంత బాగా చేస్తున్నాము అన్న దాని గురించి. మన భౌతిక శక్తి,
సామర్ధ్యం, అనుభవం, సమయం
మొదలైన వాటిపై ఆధారపడి మనలోని ప్రతి ఒక్కరికి 'సర్వశ్రేష్టమనేది'
వేర్వేరుగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఇది కొన్నిసార్లు కేవలం
ఉనికి, నిశ్శబ్దం లేదా సానుభూతితో వినడం కూడా కావచ్చు. ఇది
మనల్ని ఆ శాశ్వతమైన స్థితి అయిన మోక్షానికి (గుణాలను అధిగమించడం) తీసుకెళ్తుంది (2.72).
అదే మన నియత కార్యము. ఇది 'చేయడం' గురించి, ఎన్నుకోవడం గురించి కాదు ఎందుకంటే మన
జీవితంలో అతిపెద్ద సంఘటన అయిన మన పుట్టుక మన ఎంపిక కాదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి