79. కాలాన్ని అధిగమించడం
భగవద్గీత అనేది రెండు స్థాయిల యొక్క పొందికైన సమ్మేళనము. భగవద్గీతను అర్థం చేసుకోవడానికి మనం ఈ స్థాయిల గురించి అవగాహన తెచ్చుకోవాలి. కొన్నిసార్లు శ్రీకృష్ణుడు మానవులు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలను వివరిస్తూ అర్జునుడికి స్నేహితుడిగా లేదా మార్గదర్శిగా వస్తారు. కొన్నిసార్లు ఆయన పరమాత్మగా వచ్చి అస్తిత్వాన్ని గురించి వర్ణిస్తారు. అలా వివరిస్తూ ఆయన 'నేను వివస్వతునకు ఈ నాశనం లేని యోగాన్ని ఇచ్చాను' అని అంటారు (4.1). ఇది రాజ ఋషులకు వారసత్వంగా అందించబడింది కానీ ఇది కాలక్రమేణా కోల్పోయింది అని చెప్పారు (4.2).
'వివస్వతుడు'
అంటే సూర్యభగవానుడని అర్ధం. ఆయన కాంతికి రూపకం. శ్రీకృష్ణుడు కాంతి
కంటే ముందు తాను ఉన్నానని సూచిస్తున్నారు. ఈ విశ్వం కాంతితో ప్రారంభమై ఆ తర్వాత
పదార్థం ఏర్పడిందని విజ్ఞాన శాస్త్రం కూడా అంగీకరిస్తుంది.
శ్రీకృష్ణుడు రాజ ఋషులను
ప్రస్తావిస్తున్నప్పుడు వారు వివిధ సమయాలలో జ్ఞానోదయం పొందినవారని అర్ధం
చేసుకోవాలి. ఈ జ్ఞానం నేడు మాయమైపోయింది ఎందుకంటే కాలక్రమేణా అది అనుభవ స్థాయి
నుండి కర్మకాండలు లేదా అనుష్టానాలకు పరిమితం అయ్యింది. తక్కువ అభ్యాసం, ఎక్కువ బోధించడం జరుగుతూ మతాలు,
సంప్రదాయాల రూపాన్ని తీసుకుంది.
శ్రీకృష్ణుని జన్మ
ఇటీవలిది కాబట్టి ఆయన సూర్యుడికి దీనిని ఎలా బోధించాడు అని అర్జునుడు
ప్రశ్నిస్తాడు (4.4). మనకు చాలా జన్మలు ఉన్నాయి. నీకు వాటి గురించి తెలియదు కానీ
నాకు తెలుసు అని శ్రీకృష్ణుడు సమాధానమిస్తారు (4.5). అర్జునుడి యొక్క ఈ ప్రశ్న
మానవ స్థాయిలో చాలా సహజమైనది, తార్కికమైనదిగా అనిపిస్తుంది. ఈ స్థాయిలో మనం జనన మరణాలను అనుభవింప చేసే
కాలము యొక్క నియంత్రణలో ఉంటాము. పుట్టుకకు ముందు, మరణాంతరము గురించి
మనకు ఎలాంటి అవగాహన లేదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి