88. పాపం యొక్క కోణాలు



 

వికర్మ (నిషిద్ధ కర్మ) లేదా పాపం అనే ప్రశ్న చాలా జటిలమైనది. అర్జునుడు కూడా ఈ సందిగ్ధంలో ఉండి యుద్ధంలో బంధువులను చంపడం ద్వారా పాపం కలుగుతుందని భావిస్తాడు (1.36). వేరువేరు నాగరికతలు, సంస్కృతులు విభిన్న కర్మలను పాపాలుగా  నిర్వచించాయి. ఈ జాబితా కాలక్రమేణా మారుతూ వచ్చింది. ఆధునిక యుగంలో దేశాలు తమ శిక్షాస్మృతిని కలిగి ఉంటాయి. ఇవి కొన్ని చర్యలను నేరాలు లేదా పాపాలుగా నిర్దేశిస్తాయి. ఆ పనులకు పాల్పడినప్పుడు శిక్షిస్తాయి. అటువంటి నిషేధించిన కర్మలు మనం చేసినప్పుడు అపరాధం, పశ్చాత్తాపం, అవమాన భారంతో మనల్ని మనం శిక్షించుకుంటూ ఉంటాము.

ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు, “అంతః కరణమును, శరీరేంద్రియములను జయించినవాడు, సమస్త భోగసామగ్రిని పరిత్యజించినవాడు, ఆశారహితుడైన యోగి కేవలం శారీరిక కర్మలను ఆచరించుచును పాపములను పొందడు (4.21).” శ్రీకృష్ణుడు అంతకుముందు పాపం గురించి మాట్లాడుతూ అర్జునుడితో ఇలా చెప్పారు, “జయాపజయములను, లాభనష్టములను, సుఖదుఃఖాలను సమానంగా భావించి, యుద్ధసన్నద్ధుడవు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు” (2.38).

పాపాన్ని మూల్యాంకనం చేయడంలో అర్థం చేసుకోవలసిన సూక్ష్మమైన విషయం ఏమిటంటే భౌతిక ప్రపంచంలో మనం చేసే కర్మల ఆధారంగా మనం పాపాన్ని అంచనా వేస్తాము. కానీ శ్రీకృష్ణుడికి ఇది అంతర్గత దృగ్విషయం. మనం ఏది చెబుతున్నామో, చేస్తున్నామో అనేది మన మానసిక స్థితి యొక్క పరిణామం. అందుకనే శ్రీకృష్ణుడు మానసిక స్థాయిలో అవగాహన తెచ్చుకోమని చెబుతారు. తార్కిక స్థాయిలో ఇది మనలో అనేక సందేహాలను లేవనెత్తుతుంది కానీ అనుభవ స్థాయిలో స్పష్టత వస్తుంది.

“ఏదైనా కోరుకోనిది దొరికినప్పుడు దానితో సంతుష్టి, ద్వంద్వాతీతత, అసూయ నుంచి విముక్తి, సిద్ధి-అసిద్ధి పట్ల సమానత్వం కల వ్యక్తి కర్మలను చేసినా వాటి బంధనములలో చిక్కుకోడు” (4.22) అని శ్రీకృష్ణుడు తత్త్వజ్ఞానాన్ని వివరించారు. వాస్తవానికి, ఈ శ్లోకం భగవద్గీతలో వివిధ సందార్భాలలోని చెప్పబడిన అన్ని బోధనలను కలిగి ఉన్న భగవద్గీత యొక్క సూక్ష్మరూపం అని చెప్పవచ్చు.

శ్రీకృష్ణుడు మనకు ద్వంద్వాతీత స్థితిని పొందాలని, విభజించడానికి అలవాటు పడే మనస్సును కేవలం శారీరక పోషణమునకు అవసరమైన చర్యలకు మాత్రమే ఉపయోగించమని చెప్పారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

37. అదే అర్జునుడు అదే బాణం

140. కర్మ అంటే ఏమిటి

141. శక్తి, పదార్థాల పొందిక