123. సౌకర్య స్థితిని దాటడం
కొన్ని శతాబ్దాల
క్రితం అమెరికా అనే ఖండం భూమ్మీద ఉందని యూరోపులో ఎవ్వరికీ తెలీదు. కొలంబస్
అక్కడికి చేరుకున్నప్పుడు అంత పెద్ద విశాల భూభాగం కనుగొనబడటానికి వేచి ఉందన్న
విషయం అతని అవగాహనకి మించినది. అతని జ్ఞానం ఆనాటి భౌగోళిక శాస్త్రానికి పరిమితం
కావడంతో, అతను దానిని
ఆసియా అని తప్పుగా భావించాడు.
అటువంటి ధోరణి గురించి
వివరిస్తూ, సమకాలీన
మనస్తత్వశాస్త్రం రెండు ఆలోచన విధానాల గురించి చర్చిస్తుంది మరియు వాటిని రెండు
వ్యవస్థలుగా పరిగణిస్తుంది. మొదటి వ్యవస్థ ఆకస్మికంగా, స్వయంచాలకంగా
ఉండి మన భౌతిక మనుగడకు బాధ్యత వహిస్తుంది. రెండవ వ్యవస్థ సంక్లిష్ట సమస్యలకు
సమాధానం పొందడానికి పని చేస్తుంది కాబట్టి చాలా కృషి, సమయము,
ధ్యాసను మళ్లించాల్సి ఉంటుంది. తరచూ ఈ రెండో వ్యవస్థకు అవసరమైన శ్రమ
చేయడానికి బదులు రెండో వ్యవస్థ యొక్క పనులను మనం మొదటి వ్యవస్థ ద్వారా చేయించి
తక్షణ నిర్ధారణలు, నిర్ణయాలకు వస్తుంటాము. తరచూ అటువంటి
నిర్ధారణలు, నిర్ణయాలు కొలంబస్ నిర్ణయంలా పొరపాటు ఫలితాలకు
దారితీస్తాయి. ఒక అర్థవంతమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి కావల్సిన ఆధారాలను
సమకూర్చే పని రెండో వ్యవస్థ వలన జరుగుతుంది. అటువంటి ఆధారాలు లేకుండా చేసే
నిర్ణయాలు తప్పు ఫలితాలకు దారితీస్తాయి.
రెండో వ్యవస్థ
ద్వారా చేయాల్సిన పనికి కూడా అర్జునుడు మొదటి వ్యవస్థనే ఉపయోగిస్తూ శ్రీకృష్ణుడితో
‘‘చంచలమైన నా మనస్సు కారణంగా సమభావము యొక్క శాశ్వతమైన యోగ స్థితిని
తెలుసుకోలేకున్నాను (6.33). మనస్సు అనివార్యంగా చంచలమైనది, కల్లోలితమైనది, మొండిది,
గాలి లాగా నియంత్రించలేనిది (6.34)’’ అని అంటాడు. ఇక్కడ మనస్సు
గురించి అర్జునుడికి ఉన్న పరిజ్ఞానం పరిమితం. అది చంచలమైనది అన్నంత వరకే తెలుసు.
అందుకే దాన్ని నియంత్రించలేము అన్న నిర్ధారణకు వచ్చాడు. ఈ నిర్ధారణలు అర్జునుడి గత
అనుభవాల ఆధారంగా ఏర్పడినవి. గత అనుభవాలు మన ఇంద్రియాల శక్తికి మించి చూడనీయవు.
యాదృచ్ఛికంగా, అర్జునిడి ప్రశ్న అతని ఒక్కడి ప్రశ్న
కాదు, ఇది యావత్తు మానవాళికి సంబంధించినది. మార్గము
కష్టసాధ్యము అన్న భావన మన అందరికి ఉంటుంది. ఈ సౌకర్య స్థితికి (comfort
zone) అవతల అనంత ఆనందం ఉంటుంది అని గుర్తించాలి. ఒక వైపు శ్రీకృష్ణుడి
అనంతమైన ఆనందం యొక్క హామీ మనల్ని ఆకర్షిస్తుంది (6.28). కానీ తెలియని భయం మనల్ని
మన సౌకర్య స్థితికి లాగుతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి