125. అదృష్టానికి మూలాధారము
ఎవరైనా శ్రద్ధతో వైరాగ్యాన్ని ఆచరిస్తూ
గమ్యాన్ని చేరకముందే మరణిస్తే (6.37) మళ్లీ మొదటి నుండీ ఆరంభించాలా అని అర్జునుడు
ప్రశ్నించుతాడు.
యోగమును ఆచరిస్తూ మరణించిన వ్యక్తి ఎన్నటికీ
నాశనం కాబోడు (6.40). పవిత్రులు, సంపన్నులు అయిన కుటుంబంలోనో
(6.41) యోగుల కుటుంబంలోనో పునర్జన్మ ఎత్తుతాడు. ఇటువంటి జన్మ సాధారణంగా అందరికీ
దక్కేది కాదు (6.42). పూర్వజన్మలో సమీకరించుకున్న జ్ఞానంతో పరిపూర్ణత సాధించే
దిశగా ప్రయాణం ప్రారంభించి (6.43) నిరంతర అభ్యాసంతో (6.44) అనేక జన్మల తర్వాత అత్యున్నత
గమ్యాన్ని చేరుకుంటాడు (6.45) అని శ్రీకృష్ణుడు హామీ ఇచ్చారు.
ఈ సంక్లిష్టతను అర్థం చేసుకోవటానికి మట్టి
కుండను మించిన ఉదాహరణ లేదు. కుండను తయారు చేసి పక్కన పెట్టినప్పుడు కొంత
స్థానాన్ని ఆక్రమిస్తుంది. కానీ అదే కుండను ఒక చోట నుండి మరో చోటికి మార్చినప్పుడు
కుండ ఆక్రమించిన స్థలం దానితో పాటు వెళ్ళదు. కానీ కుండను ఎక్కడ పెట్టినా అక్కడ
కొంత స్థలాన్ని ఆక్రమిస్తుంది. రెండోది ఈ కుండలో ఉంచిన వస్తువుల స్వభావాన్ని బట్టి
కుండ వాసన లాంటి కొన్ని లక్షణాలు సంతరించుకుంటుంది. కుండ పగిలిన తర్వాత కూడా కొంత
సమయం వరకు ఈ సువాసన కొనసాగే అవకాశం ఉంది. సువాసనతో కూడిన ఆ స్థలం మరొక కుండతో
చుట్టుముడితే ఆ కుండ ఆ స్థలం యొక్క మునుపటి లక్షణాలను కలిగి ఉంటుంది.
ఇదే సారూప్యతను మానవ శరీరానికి అన్వయించవచ్చు.
మానవ శరీరం కుండ అయితే, లోపల ఉన్న స్థలం ఆత్మ, చుట్టూ ఉన్న బాహ్య ప్రదేశమే పరమాత్మ. శరీరం తన
విధులను నిర్వర్తించలేనప్పుడు, ఆత్మ పాత బట్టల వలె శరీరాన్ని
మారుస్తుంది (2.22).
సమకాలీన విజ్ఞానశాస్త్రం వాస్తవికత యొక్క గణిత
నమూనా ప్రకారము సుమారు 10 ఆయములు/ కొలతలు (dimensions) ఉన్నాయని సూచిస్తుంది. మన
త్రిమితీయ అస్తిత్వంలో కుండ యొక్క ఉదాహరణను సులభంగా అర్ధం చేసుకోవచ్చు. పరమాత్మగా
శ్రీకృష్ణుని హామీ ఒక జీవితం నుండి మరొక జీవితానికి అనేక గుణాలను తీసుకువెళ్లే
బహుళ కోణాల యొక్క అస్తిత్వ స్థాయిలో ఉంది. జీవితంలో మనము ఏ దశలో ఉన్నా ఈ హామీ మనకు
ప్రయాణాన్ని ప్రారంభించడానికి సహాయపడుతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి