126. యోగియే శ్రేష్ఠుడు


 

‘‘తపస్వి కంటే, జ్ఞాని కంటే చివరకు కర్మి కంటే కూడా యోగి శ్రేష్ఠుడు. అందువల్ల ఓ అర్జునా, యోగిలాగా జీవించటానికి ప్రయత్నించు (6.46). యోగులందరిలోనూ ఎవరైతే నాలో లీనమై ఉంటారో, అపరిమితమైన శ్రద్ధతో, భక్తితో నన్ను కొలుస్తారో అటువంటి వారు పరమ శ్రేష్ఠుడు (6.47) అని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నారు.

యోగము అంటే ఐక్యత. యోగి అంటే ఆత్మతో ఐక్యత చెందినవాడు. వివిధ సందర్భాల్లో యోగికి సంబంధించిన వేర్వేరు గుణాల గురించి శ్రీకృష్ణుడు వివరిస్తారు. ద్వంద్వాతీతుడుగా, గుణాతీతుడుగానూ ఉండటం, గుణాలే అసలైన కర్తలన్న అవగాహన కలిగి ఉండటం, తాను కేవలం సాక్షిని మాత్రమే అని తెలుసుకోగలిగి ఉండటం, మిత్రులు శత్రువుల పట్ల, పొగడ్తలు విమర్శల పట్ల సమత్వ భావమును కలిగి ఉండటం, యజ్ఞం నిర్వహించినట్లు ఎటువంటి ప్రేరణ లేకుండానే కర్మలు నిర్వహించటం (నిష్కామ కర్మ), కర్మ ఫలాలను త్యజించటం, అన్నిటినీ మించి తనతో తాను సంతృప్తి చెందగలగటం లాంటివి యోగికున్న వివిధ గుణాలని శ్రీకృష్ణుడు వివరిస్తారు.

తపస్వి అంటే కఠినమైన క్రమశిక్షణతో త్యాగాలు చేస్తూ ఉన్నతమైనదాన్ని సాధించడానికి తపస్సు చేసే వ్యక్తి. సాధారణ వ్యక్తులు చేయలేని పనులను వారు చేస్తారు కాబట్టి వారిని గౌరవిస్తారు. కానీ ఏదో సాధించాలనే కోరిక ఇంకా వారిలో ఉంది కాబట్టి పరమాత్మను చూడాలనే కోరికతో సహా అన్ని కోరికలను త్యజించిన యోగి కంటే తపస్వి దిగువ మెట్టు మీదనే ఉంటాడు. సముద్రంలో ప్రవేశించిన తర్వాత నదులు వాటి ఉనికిని కోల్పోయినట్లు యోగిలో కోరికలకు తావు లేదు (2.70).

'శాస్త్ర జ్ఞానులు' అంటే జ్ఞానాన్ని పొందాలనే తపన ఉన్న వ్యక్తి. జ్ఞానుల పట్ల కూడా సమాజం ఆరాధనా భావాన్ని కలిగి ఉంటుంది ఎందుకంటే సాధారణ వ్యక్తుల కంటే ఎక్కువ విషయాలు వీరికి తెలుసు అన్న భావన సర్వత్రా ఉంటుంది. కానీ యోగి తనలో అన్ని జీవులను, తనని అన్ని జీవులలో గ్రహించియున్నాడు (6.29). ఇది తెలిసిన తర్వాత ఎవరూ భ్రమపడరు (4.35). ఇంతకు మించి తెలుసుకో వలసింది ఏమీ లేదు.

'కర్మి' ఆచార ప్రదర్శనలకు కట్టుబడి ఉంటాడు. అయితే యోగి యజ్ఞం వంటి ప్రేరణ లేని చర్యలను చేస్తూ కర్మబంధనములో ఎన్నటికీ చిక్కుబడడు. అందుకే, యోగి కర్మి కంటే శ్రేష్ఠుడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

37. అదే అర్జునుడు అదే బాణం

140. కర్మ అంటే ఏమిటి

141. శక్తి, పదార్థాల పొందిక