127. నేర్చుకోవడానికి వినడం నేర్చుకోవాలి
త్రీ-మితీయ (three dimensional) భూభాగాన్ని
సూచించడానికి ద్వి-మితీయ (two dimensional) మ్యాపును
సాధారణముగా ఉపయోగిస్తాము. ఇది సరళమైన, ఉపయోగకరమైన, అనుకూలమైన పద్ధతి కానీ దీనికి పరిమితులు ఉన్నాయి. ఈ భూభాగాన్ని సమగ్రంగా
వీక్షిస్తే తప్ప మనకు దాని సంపూర్ణత అవగతం కాబోదు. పదాల గురించిన విషయం కూడా అంతే.
పదాలు బహుముఖీయ జీవితాన్ని వర్ణించటానికి ఉన్న సాధనాలు. వ్యక్తులు, పరిస్థితులు, ఆలోచనలు, భావనలు,
వారి చర్యలను కూడా వర్ణించేవి ఇవే. కానీ పదాలకు కూడా కొన్ని
పరిమితులున్నాయి.
మొదటి పరిమితి
ఏమిటంటే పదములు ధృవణతను కలిగి ఉంటాయి. మనం ఓక విషయాన్ని మంచిది అని వివరిస్తే
రెండో విషయం చెడ్డది అన్న అవగాహన కలిగే అవకాశముంటుంది. ఈ ద్వంద్వాత్మకత లేదా
ధృవణత్వాన్ని అధిగమించిన స్థితిని వివరించేందుకు తగినన్ని పదాలు లేవు. మరో పరిమితి
ఏమిటంటే ఆయా వ్యక్తుల మానసిక స్థాయి, స్థితి, వారున్న పరిస్థితులు, వారికున్న
అనుభవాలను బట్టి ఒకే పదం వేర్వేరు వ్యక్తుల్లో భిన్నమైన భావనలు కల్గించవచ్చు.
అందువలనే ఇటువంటి పరిస్థితులను అధిగమించటానికి కొన్ని సంస్కృతులు నిశ్శబ్దాన్ని
మాధ్యమంగా ఉపయోగిస్తుంటాయి. మూడో పరిమితి పదాలు విన్నప్పుడు వాటి సాహిత్యపరమైన
అర్థం దగ్గరే తరచూ ఆగిపోయే స్వభావం మనకు ఉంటుంది. అంటే సత్యాన్ని గుర్తించి కూడా సత్యవంతుని
జీవితం జీవించకపోవటం వంటిది.
అటువంటి పదాల్లో
ఒకటి 'నేను' అన్న పదం. ఈ పదాన్ని శ్రీకృష్ణుడూ అర్జనుడూ ఇరువురూ ఉపయోగిస్తారు.
అర్జునుడు 'నేను' అనేది అనేక విభజనలతో
అతని గుర్తింపు అయితే, శ్రీకృష్ణుడి 'నేను'
అనేది వ్యక్తమైన అస్థిత్వము యొక్క అన్ని భాగాల యొక్క సమ్మేళనము.
పదాల పరిమితుల అవగాహన మనకు భగవద్గితను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ
క్రింది శ్లోకం అటువంటి ఒక ఉదాహరణ.
శ్రీకృష్ణుడు ఇలా
అంటారు, "ఓ పార్థా,
వినుము; నీ మనస్సును పూర్తిగా నాపై స్థిరపరిచి,
యోగాభ్యాసం చేస్తూ, నన్ను ఆశ్రయిస్తే, నీవు నిస్సందేహంగా నన్ను పూర్తిగా తెలుసుకుంటావు" (7.1).
శ్రీకృష్ణుడి 'నన్ను' చేరుకోవడానికి,
ఉప్పు బొమ్మ తనంతట తాను కరిగిపోయి సముద్రం అయినట్లు మనము మన
అహంకారాన్ని విలీనం చేయాలి.
శ్రీకృష్ణుడు 'శ్రుణు' (వినుము)
అనే పదాన్ని ఉపయోగించారు. మనకి ఎలా మాట్లాడాలో నేర్పించారు. అది ఒక భాష కావచ్చు
లేదా మనల్ని మనం ఎలా వ్యక్తీకరించుకోవాలో కావచ్చు. కానీ 'ఎలా
వినాలో' మనకు ఎవరూ, ఎప్పుడూ నేర్పలేదు.
జీవితాన్ని నిశితంగా పరిశీలిస్తే, అర్జునుడు ఎదురుకొంటున్న
కురుక్షేత్ర యుద్ధం వంటి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు మనము వినడాన్నీ
నేర్చుకుంటాము. ఇది నేర్చుకోవడానికి వినడం నేర్చుకోవడం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి