130. అజ్ఞేయమును తెలుసుకోవడం
శ్రీకృష్ణుడు తన పరా ప్రకృతిని విశ్వానికి మద్దతునిచ్చే 'జీవన తత్త్వము'గా వర్ణించారు (7.5). ఈ సందర్భములో అందమైన ఆభరణాన్ని రూపొందించడానికి రత్నాలకు సహాయపడే సూత్రము యొక్క ఉదాహరణను ఇచ్చారు. ఇదే తరహా వివరణతో మరికొన్ని వ్యాఖ్యానాలకు దారితీసే ఉదాహరణలు కూడా శ్రీకృష్ణుడు వివరిస్తారు.
'జీవన
తత్త్వము' గురించి వివరిస్తూ, శ్రీకృష్ణుడు,
"చాలామంది అనేక రకాలుగా వర్ణించినప్పటికీ 'ఇది' ఎవరికీ తెలియదు" (2.29) అని చెప్పారు. 'ఎవరికీ' అంటే ఇంద్రియాలు ద్వారా దానిని అర్థం
చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని సూచిస్తుంది. 'జీవన
తత్త్వము' ఇంద్రియాలకు అతీతమైనది అని అర్ధము చేసుకోవాలి.
శ్రీకృష్ణుడు 'జీవన తత్త్వము' గురించి
వివరించే క్రింది శ్లోకాలను అర్థం చేసుకోవడానికి ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి.
"ఓ
అర్జునా! జలములో రసతన్మాత్రను నేనే. సూర్యచంద్రులలో కాంతిని నేనే, వేదములన్నింటి లోను ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును,
పురుషుల యందు పౌరుషమును నేనే" (7.8) అని శ్రీకృష్ణుడు చెప్పారు.
'రస' ను సాధారణంగా రుచి అని
వ్యాఖ్యానము చేస్తారు. కానీ ఇది సంపూర్ణ అర్థం కాదు. జలంలో ఇమిడి ఉండే జీవాన్ని పోషించే
శక్తి గురించి చెప్పటానికి శ్రీకృష్ణుడు ఈ పదాన్ని ప్రయోగిస్తున్నారు. అదేవిధంగా
అంతరిక్షంలోని ధ్వని అని చెప్పినప్పుడు తరంగాలను ప్రసారం చేసే శక్తి గురించి
ప్రస్తావిస్తున్నారు.
"పృథ్వియందు
పవిత్ర గంధతన్మాత్రను, అగ్నియందు
తేజస్సును, సమస్త ప్రాణులలో జీవశక్తిని (చైతన్యమును),
తాపసులలో తపస్సును నేనే (7.9). సమస్త భూతములకును నన్ను సనాతనమైన
(శాశ్వత) బీజముగా తెలిసికో. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో
తేజస్సును నేనే (7.10). బలవంతులలో కామరాగరహితమైన బలమును నేనే, భూతములన్నింటి యందును (సమస్త ప్రాణులయందును) ధర్మమునకు అనుకూలమైన
(శాస్త్రసమ్మతమైన) కామమును నేనే" (7.11) అని శ్రీకృష్ణుడు చెప్పారు.
శ్రీకృష్ణుడు ఇంతకుముందు యోగము (ధర్మం)లో ప్రతిదీ సామరస్యముగా ఉంటుందని చెప్పారు
(2.50) - అది ప్రేమ కావచ్చు లేదా యుద్ధం కావచ్చు.
సర్వవ్యాప్త
అస్తిత్వం తనను తాను వర్ణించుకోవాలంటే పదాలు చాలవు అన్న వాస్తవమే ఇక్కడ మనకు
సాక్షాత్కరిస్తుంది. ఇంద్రియాలకు అతీతుడైన పరమాత్మను అవగాహన చేసుకోవడానికి పైన
ప్రస్తావించినవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి