131. మాయను అధిగమించడం
శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రకృతి నుండి జన్మించిన
మూడు గుణాలు, వాటి స్వభావాల గురించి వివరించి ఉన్నారు. ఈ
గుణాలే వేర్వేరు పద్ధతుల్లో అన్ని కర్మలకు కర్తలని కూడా బోధించియున్నారు (3.5).
వాస్తవానికి కర్మలన్నియూ ఈ గుణాలచే నిర్వర్తించబడును (3.27).
కర్మలు అనేవి గుణాల మధ్య జరిగే పరస్పర చర్యలు తప్ప మరేమీ కాదు. సత్వగుణవంతులు
జ్ఞాన పిపాసులు. రజోగుణవంతులు కార్యోన్ముఖులు. తమో గుణము అజ్ఞానానికి మరియు
సోమరితనానికి దారితీస్తుంది. ఈ విషయం గురించి శ్రీకృష్ణుడు మరింత వివరణ ఇస్తూ
‘‘సత్వ, తమో, రజో గుణాలు మరియు వాటి
వ్యక్తీకరణలన్నీ నానుండే ఉద్భవిస్తాయి. అవి నాలో ఉన్నప్పటికీ నేను వాటిలో లేను’’
(7.12) అని చెప్తున్నారు.
ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవటానికి ఆకాశాన్ని,
మేఘాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆకాశంలో మేఘాలు ఉంటాయి కాని ఆకాశం
మేఘాలలో ఉండదు. కానీ ఆకాశం లేకుండా మేఘాల
మనుగడ సాధ్యము కాదు. సముద్రంలో అలలు ఉంటాయి కానీ సముద్రం అలల్లో ఉండదు.
మనలను సమ్మోహితులను చేయగల సామర్ధ్యం గుణాలకు
ఉందని గతంలోనే శ్రీకృష్ణ పరమాత్ముడు హెచ్చరించియున్నారు (3.29). మూడు గుణాలచే
సమ్మోహితులైన వ్యక్తులు ‘నేను గుణాతీతుడనని, శాశ్వతమని’
తెలుసుకోలేకపోతున్నారని చెప్పారు (7.13).
సాధారణంగా తమో, రజో
గుణాలను విడనాడితే సత్వగుణ సంపన్నులవుతారని భావిస్తారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే ప్రతి
గుణానికి సమ్మోహింపజేసే శక్తి ఉంటుంది కాబట్టి ఈ గుణాలన్నిటినీ అధిగమించి
శాశ్వతమైన స్థితిని పొందేందుకు మనం వాటి గురించి అవగాహన పెంచుకోవాలి.
గుణాలతో కూడిన నా దివ్యమాయ ని అధిగమించడం
కష్టమని శ్రీకృష్ణుడు చెప్పారు. అయితే ఎవరైతే ఆయనకు సమర్పితమవుతారో అటువంటి వారు ఈ
మాయ ప్రభావాన్ని అధిగమిస్తారని భరోసా ఇచ్ఛారు (7.14). మనల్ని మనం పరమాత్మకు
సమర్పించుకొని భ్రాంతిని అధిగమించి సంతోషదాయకమైన జీవితాన్ని జీవించటం ఒక మార్గం.
లేదా భ్రాంతికి లోనై ఎండమావి వెంట పరుగులు తీస్తూ నిరంతరం సంఘర్షణాత్మక
జీవితాన్ని జీవించటం రెండో మార్గం అన్నది శ్రీకృష్ణ పరమాత్మ బోధనల సారాంశం.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి