133. శ్రద్ధ వరదాయిని

 

వ్యక్తము (మనుషుడు), అవ్యక్తము (పరమాత్ముడు) మధ్య ఉన్న సమన్వయమే అస్తిత్వానికి మూలం. పరమాత్ముడిని మరిచిపోయి మనిషికి మనిషికి మధ్య జరిగే సంపర్కాలు దానవ లక్షణాలని శ్రీకృష్ణ పరమాత్ముడు గుర్తు చేస్తున్నారు (7.15). తదుపరి స్థాయి మనిషికి-పరమాత్మకు మధ్య జరిగే సంపర్కం, ఏర్పడే సంబంధం. మనిషి ఎండమావుల వెంట పరుగెత్తి అలసిపోయినప్పుడు లేదా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినప్పుడు పరమాత్మను గుర్తు చేసుకుంటాడు.

మనిషికి భగవంతునికి మధ్య ఏర్పడే సంబంధాలు అంటే మనిషి భగవంతుని కొలిచే మార్గాలు నాలుగని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నారు. స్థూలంగా భక్తులు నాలుగు రకాలు. మొదటి రకం భక్తులు తమకున్న కష్టాలు తొలగిపోతే చాలని అనుకుంటారు. రెండో రకం భక్తులు సంపాదన ద్వారానో లేదా విజయాల ద్వారానో మానసిక ప్రశాంతతను పొందాలని కోరుకుంటారు. మూడో రకం భక్తులు జ్ఞానాన్ని పెంచుకోవాలని ఆశిస్తారు. నాల్గో రకం భక్తులు జ్ఞానులు (7.16).

అజ్ఞానులైన మొదటి మూడు రకాల భక్తులూ తమ కోరికలు నెరవేర్చుకోవటానికి వేర్వేరు దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రార్థిస్తారు (7.20). రోగ నివారణకు గాను వచ్చిన రోగానికి అనుగుణంగా సంబంధిత వైద్యుడిని సంప్రదించటం లాంటిదే ఇది. మనుషులు భక్తి శ్రద్ధలతో తనను కొలిచినప్పుడు ఆయా ఆ శ్రద్ధను మరింత గాఢము చేస్తానని (7.21), వారి శ్రద్ధకు అనుగుణంగానే వారి వారి కోరికలు తీరుతుంటాయని శ్రీకృష్ణ పరమాత్ముడు హామీ ఇస్తున్నారు (7.22). అయితే ఈ మూడు రకాల మార్గాల్లో భక్తులు సాధించేది పరిమితమైన ఫలితాలు మాత్రమే (7.23).

ఈ శ్లోకాలను జాగ్రత్తగా గమనించినప్పుడు రెండో అధ్యాయం 47వ శ్లోకంలో చెప్పబడిన ఫలితాన్ని ఆశించకుండా పని చేయాలన్న హితబోధకు భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఫలితాన్ని ఆశించకుండా పని చేయటమే పరమాత్ముని శాశ్వత స్థితి యొక్క లక్షణము. భక్తుల పట్ల ఉన్న కరుణతో అజ్ఞానాంధకారాల నుండి జ్ఞానం వైపు అడుగులు వేయడానికి ఇది శ్రీకృష్ణుని సహాయము. ఈ మార్గము ద్వారా భక్తులు చివరకు కోరికలు లేని, కోరికలు కలగని స్థితికి చేరుకుంటారు.

 శ్రద్ధతో చేసే ప్రార్ధనలు భక్తుల కోరికలను నెరవేరుస్తాయని శ్రీకృష్ణుడు చెప్తున్నారు. శ్రద్ధతో జరిగే ప్రార్ధనల వెనక తానుంటానని భరోసా ఇస్తున్నారు. అంటే మనం చేసే పనిలో, కొలిచే భగవంతుని పట్ల ఉన్న శ్రద్ధ వలన కోరిన ఫలితాలు లభిస్తాయి. భౌతిక ప్రపంచంలో మనం ఎప్పుడైనా, ఏదైనా సాధించామంటే దానికి కారణం మనలో ఉన్న శ్రద్ధే. శ్రద్ధ అంటే ప్రతికూల పరిస్థితుల్లో సైతం అదే అంకితభావాన్ని కలిగి సహనముగా వేచి ఉండటం. దీన్నీ శ్రద్ధ మరియు సబూరి కలిగి ఉండటం అని కూడా అంటారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

37. అదే అర్జునుడు అదే బాణం

140. కర్మ అంటే ఏమిటి

141. శక్తి, పదార్థాల పొందిక