136. ద్వంద్వాలతో వచ్చే భ్రమ
"జగత్తునందు
ప్రాణులన్నియును రాగద్వేషముల వలన కలిగిన సుఖదుఃఖాది ద్వందముల ప్రభావమున అంతులేని
మోహములో పడిపోవుచున్నవి" (7.27) అని శ్రీకృష్ణుడు చెప్పారు. జీవితంలో మనం
రెండు రకాలైన భ్రమలకు లోనవుతూ ఉంటాము. మూడు గుణాలతో ప్రేరితమైన యోగ మాయ ఒకటైతే, రాగ ద్వేషాలనే పరస్పర భిన్న ధృవాల
కారణంగా ఏర్పడే భ్రమ రెండోది. ఈ రెండింటిలో ఏ ఒక్క దాన్ని మనం అధిగమించినా
అనివార్యంగా రెండో దాని ప్రభావం నుండి కూడా విముక్తులు అవుతాము.
అజ్ఞానమే ఈ భ్రమలకు
తొలి పునాది. దాని పర్యవసానంగా ఇక్కట్ల పాలవుతాము. ఈ ఇక్కట్లు మరేమిటో కాదు, సుఖాన్ని వెతుక్కునే ప్రయత్నంలో
అనుభవించే బాధలే. ఒక్కోసారి ఈ బాధలు మనం పని చేసిన వెంటనే ఎదురు కాకపోవచ్చు. కానీ
కొంత కాల వ్యవధి తర్వాత ఇటువంటి బాధలు మనల్ని వెంటాడుతాయి. మన భావాలను అణిచివేయడం,
దాచిపెట్టడం అనేది ఈ భ్రమల విషయంలో రెండవ స్థాయి. మనం ఎటువంటి
భ్రమలకూ లోను కాలేదని బయటి ప్రపంచానికి చెప్పుకోవటానికి, చూపించుకోవటానికీ
ఆమోదయోగ్యమైన ప్రవర్తనను అరువు తెచ్చుకుంటాము. కొన్ని సందర్భాల్లో ఇతరుల పట్ల
చిన్నచూపుతో కూడా వ్యవహరిస్తూ ఉంటాము. శ్రీకృష్ణుడు ఇటువంటి వారిని కపటులుగా
పేర్కొన్నారు (3.6). ఇక్కడ వాస్తవం ఏమిటంటే మనం ఎంతగా అణిచి పెట్టుకున్నా ఈ
లక్షణాలు ఓ బలహీన క్షణంలో బయట పడతాయి.
మనం మన చుట్టూ జరిగే
వాటికన్నింటికీ జ్ఞాని లాగా కేవలం సాక్షిగా మిగిలే దశకి చేరుకోవటానికి ఇటువంటి
భ్రమల నుండి విముక్తి పొందాలని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నారు.
"నిష్కామభావముతో పుణ్యకర్మలును ఆచరించు పురుషుల పాపములు నశించును. అట్టివారు
రాగద్వేషజనితములైన సుఖదుఃఖాది రూప మోహములనుండి విముక్తులయ్యెదరు.
దృఢనిశ్చయముగల్గిన అట్టి భక్తులు అన్ని విధముల నన్నే భజింతురు" (7.28).
దీన్నే సకలమూ పరమాత్మకు సమర్పితం గావించి మనం నిమిత్తమాత్రులుగా ఉండిపోవడం అని
చెప్పారు.
కొన్ని సందర్భాల్లో
జ్ఞానీ, భ్రమలకు లోనైన అజ్ఞానీ
ఒకేరకమైన ప్రవర్తన కలిగి ఉండొచ్చు. కానీ వారిద్దరిలో వ్యత్యాసం ఆంతరంగిక
లక్షణాల్లో ఉంటుంది. జ్ఞాని సుఖ: దు:ఖాలు, లాభ నష్టాలు,
జయాపజయాల మధ్య సంతులత పాటిస్తూ అంతర్గత సమత్వాన్ని కలిగి ఉంటాడు.
కర్మబంధనాల నుండి విముక్తి పొందుతాడు. భ్రమలకు లోనైన వారు ఇటువంటి సంతులనత్వాన్ని
కోల్పోతారు. అటువంటి వారి కర్మబంధనాలు రాయి మీద గుర్తుల్లాగా దీర్ఘకాలం కొనసాగుతూ
ప్రభావం చూపుతూ ఉంటాయి. సరైన ఉదాహరణలు అరుదు కావటంతో ఇటువంటి పరిస్థితిని మనం
అర్థం చేసుకోవటం క్లిష్టంగా ఉంటుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి