137. 'అ' నుండి 'జ్ఞ' వరకు మంత్రం
మనము రెండు రకాల భ్రాంతులకు లోనవుతాము. మూడు గుణాల ప్రభావం చేత ఏర్పడే యోగ మాయ ద్వారా కలిగే భ్రాంతి మొదటిది. అన్ని చర్యలు వివిధ గుణాల మధ్య జరిగే సంపర్కాలు వలన అయినప్పటికీ ఈ భ్రాంతికి లోనైన వారు ఈ చర్యలన్నింటికీ తామే కారణమన్న అహంకారాన్ని కలిగి ఉంటారు. ఆసక్తి, విరక్తి వంటి పరస్పర భిన్న ధృవాలతో ఏర్పడే భ్రాంతి రెండోది. ఈ రకమైన భ్రాంతులకు లోనైన వారు సిరిసంపదలు పోగేసుకోవటం, వ్యక్తులను ప్రభావితం చేయడం, సుఖ సాధనాల్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రెండు రకాలైన భ్రాంతులు ఒకదానినొకటి ప్రభావితం చేస్తూ ఉంటాయి. అహంకారం కోరికలు కలిగి ఉండటాన్ని సమర్ధిస్తుంది. కోరికలు తీరినప్పుడు అవన్నీ మన కృషి ఫలితమేనన్న అహంకారం తలెత్తుతుంది.
ఈ విషయాన్ని
వివరిస్తూ శ్రీకృష్ణుడు ఇలా అంటున్నారు,
“నన్ను శరణుపొంది జరామరణ విముక్తికై ప్రయత్నించు పురుషులు ఆ
పరబ్రహ్మను, సమస్త ఆధ్యాత్మమును, సంపూర్ణ
కర్మను తెలిసికొందురు (7.29). అధిభూత, అధిదైవ, అధియజ్ఞములతోపాటు అందరికినీ ఆత్మరూపుడు అయిన నన్ను అంత్యకాలము నందైనను
తెలిసికొనువారు నిశ్చలబుద్ధితో నన్నే చేరుదురు" (7.30).
ఇక్కడ వివిధ రకాలైన
భ్రాంతుల గురించి చర్చించిన వెంటనే (7.25,
7.27) శ్రీకృష్ణ పరమాత్ముడు మరణం, వృద్ధాప్యముల
గురించి చర్చించడం ఆసక్తికరమైన విషయం. భ్రాంతుల కారణంగా మన కోరికలు తీరవేమోనన్న
భయాందోళనలకు లోనవుతాము. మన అహంకారం దెబ్బతింటుందని భయపడుతాము. నిజానికి మరణ భీతి
అన్నిటికంటే పెద్ద భయము. వివిధ సందర్భాల్లో ఈ భయము వివిధ రూపాలు తీసుకుంటుంది.
అనేక సంసృతుల్లో మరణాన్ని వైరాగ్యానికి సాధనంగా, అన్ని రకాల
భయాల నుండి మనస్సును విముక్తి చేసే సాధనంగా కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. అందరూ
పరమాత్ముని ఆశ్రితులు కావాలని తద్వారానే భయము నుండి విముక్తుడై పరమాత్మను సమగ్రంగా
తెలుసుకునే అవకాశం కలుగుతుందని శ్రీకృష్ణుడు వివరిస్తున్నారు.
ఒక వివేకముగల
వ్యక్తి అన్ని రకాల ఫలితాలను తమ ప్రార్ధనలకు భగవంతుడు స్పందించి ఇచ్చే దీవెనలుగా
భావిస్తాడు. అక్షర మాలను ('అ' నుంచి 'జ్ఞ' వరుకు) ఆమూలాగ్రం చదివి ఈ అక్షరాలను తనకు తోచినట్లు చేకూర్చుకోని తనను
ఆశీర్వదించమని భగవంతునికి ప్రార్ధిస్తాడు. దాని గూఢ అర్ధము ఏమిటంటే మనకు ఏమి
కావాలన్నా, ఏమి జరగాలన్నా అదంతా ఈ అక్షరమాల యొక్క అక్షరాల
చేకూర్పు ద్వారానే జరుగుతుంది. ఈ వివేకముగల వ్యక్తి యొక్క పరిస్థితిని ఆశ్రితుని
స్థితిగా చెప్పవచ్చు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి