139. బ్రహ్మ యొక్క అవస్థ
నన్ను ఆశ్రయించి విముక్తి
కోసం నిరంతరం ప్రయత్నం చేసిన వాడే బ్రహ్మమును దర్శించగలుగుతాడు అని శ్రీకృష్ణ
భగవానుడు చెప్పారు (7.29). ఆ మాట విన్న అర్జనుడు బ్రహ్మ అంటే ఏమిటి అని
ప్రశ్నిస్తాడు (8.1). అక్షరము, (శాశ్వతమైనది, ధ్వంసం చేయబడనిది, నాశనం కానిది) పరమమూ అయినది బ్రహ్మము (8.3) అని శ్రీకృష్ణ పరమాత్ముడు
సమాధానమిచ్చారు. అంటే దీనికి మించి మరేమీ లేదని, ఏ బాహ్య కారకాలపైనా
ఆధారపడనిదని అర్థం. మనం నిరంతరం మారుతూ ఉండేది, నాశనమయ్యేది,
అశాశ్వతమైనవి మాత్రమే చూస్తూ ఉంటాము. అందువలన బ్రహ్మమును అర్ధము
చేసుకొనుట కష్టతరం అవుతుంది.
ఉదాహరణకు, మన భౌతిక శరీరం నిరంతరం మారుతూ
ఉంటుంది. మన శరీరంలో 95 శాతం మనకు తెలీకుండానే ఏడేళ్లల్లో
మారిపోతుంది. కానీ మన జన్యు నిర్మాణం (DNA) మాత్రం యథాతథంగా
ఉంటుంది. సౌర వ్యవస్థ నాలుగు బిలియన్ల సంవత్సరాల్లో నాశనం అవుతుంది, విశ్వం కూడా 150 ట్రిలియన్ సంవత్సరాల్లో నాశనం అవుతుంది. అదేవిధంగా మన
ఆలోచనలు కూడా నిరతరం మారుతూ ఉంటాయి. వ్యక్తులు, వస్తువులు,
విషయాలు, పరిస్థితులు వంటి వాటి గురించి మన
అభిప్రాయాలు కూడా నిరంతరం మారుతూ ఉంటాయి. ఐదుగురు గుడ్డి వాళ్లు ఏనుగును ఎలా
భిన్నముగా గ్రహిస్తారో మనము కూడా ఒకే రకమైన వాస్తవాలపై విరుద్ధమైన అభిప్రాయాలు
ఏర్పర్చుకుంటూ ఉంటాము. మనము ఒక లక్ష్యాన్ని చేరుకొన్న తరువాత మన లక్ష్యాలు కూడా
మారిపోతూ ఉంటాయి.
బ్రహ్మజ్ఞానాన్ని
ఆర్జించటంలో మనకు ప్రధానంగా అవరోధాలు కల్పించేది మన ఇంద్రియాలే. ఈ ఇంద్రియాలు
బాహ్య ప్రపంచంలో జరిగే మార్పులను గమనించటానికి వీలుగా రూపొందించబడ్డాయి. అంటే
కాంతి, వాసన, ధ్వని వంటి వాటిలో వచ్చే మార్పులను గమనించటానికి వీలుగా మన ఇంద్రియాల
అమరిక ఉంటుంది. ఈ సామర్ధ్యం మనుగడ కొనసాగటానికి అనివార్యమైనది. అదే సమయంలో ఈ
సామర్ధ్యాలే 'అక్షరము' ను
గుర్తించనీయకుండా అడ్డుపడుతూ ఉంటాయి. మనల్ని ఇక్కడకు తెచ్చిన అంశాలు (మనుగడ
సాగించటానికి ఉపయోగపడే అంశాలు) అక్కడకు (పరమాత్మవద్దకు) చేర్చలేవు. అందువలనే శ్రీకృష్ణ పరమాత్ముడు మన
ఇంద్రియాల గురించి జాగ్రత్త వహించమని పదేపదే హెచ్చరిస్తున్నారు.
అశాశ్వతమైనదాన్ని, నిరంతరం మారుతూ ఉండే దాన్ని అర్థం
చేసుకుని త్యజిస్తుపోతే మిగిలేది 'అక్షరము'. ఈ స్థితి లోలకంలో నిశ్చలమైన స్థానాన్ని చేరుకోవటం లాంటిది. తిరిగే చక్రం
యొక్క స్థిరమైన ఇరుసు లాంటిది. అనిశ్చితితో కూడిన వాటి పట్ల (సృష్టి) మనం
అనుబంధాలు పెంచుకోకుండా ఉండటం. శాశ్వతమైన సృజనాత్మకత మీదనే నిరంతరం దృష్టి నిలిపి
ఉంచటం. ఇలా చేయటం భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించటమే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి