144. మనస్సు, హృదయము
శ్రీకృష్ణుడు అర్జునుడిని గమనిస్తు సాగించే సంభాషణే
భగవద్గీత. తన కర్తవ్యం అయిన కురుక్షేత్ర యుద్ధాన్ని చేయడానికి సిద్ధముగా లేని
అర్జునుడు అన్ని వేళలా పరమాత్ముని స్మరణ చేస్తూ యుద్ధం చేయమని (8.7) శ్రీకృష్ణుడు బోధించినప్పుడు
అర్జునుడి మనస్సులో వెల్లువెత్తిన సందేహాలను ఆయన గుర్తించారు. చేతిలో ఉన్న పని
పూర్తి చేయటానికి ఎదరయ్యే ప్రతిఘటన నేటికీ మనలో కనిపిస్తుంది.
శ్రీకృష్ణ పరమాత్ముడు తన గురించి వివరిస్తూ తాను
"సర్వజ్ఞుడు, సనాతనుడు, అందరిని
శాసించు వాడు, అణువు కంటేను సూక్ష్మమైనవాడు, అందరిని పోషించువాడు, అచింత్య రూపుడు, సూర్యుని వలె నిత్యచేతన ప్రకాశరూపుడు, అజ్ఞానాంధకారమును
పారద్రోలువాడైన పరమేశ్వరుడు" అని చెప్పారు (8.9). ఈ అస్థిత్వము తనను తాను
వివరించటానికి పూనుకున్నప్పుడు పదాలు సరిపోవు.
తనను స్మరించుకోవటానికి శ్రీకృష్ణ పరమాత్ముడు
రెండు మార్గాలున్నాయని చెప్తున్నారు. మొదటిది అవగాహనతో కూడిన మార్గం. "యోగము
ద్వారా స్థిరచిత్తం సాధించి పరమాత్మయందు ధ్యానం నిలిపిన వాడు సర్వ శక్తివంతుడైన ఆ
పరమాత్మను చేరుకోగలడు’’ అని అవగాహన మార్గము గురించి చెప్పారు (8.8).
ఇంద్రియాల ద్వారా స్వీకరించిన విషయాలను మన
మనస్సు విభజిస్తూ ఉంటుంది. ఈ విభజన సుఖదుఃఖాలనే భిన్న ధృవ లక్షణాలకు కేంద్రం
(2.14). మన భౌతిక మనుగడకు ఈ రకమైన విభజన క్షమత అవసరమే అయినప్పటికీ ఈ క్షమతలను
అదుపులో పెట్టే సామర్ధ్యము కావాలి. ఈ
సామర్ధ్యాన్ని పెంపొందించుకోవటానికి యోగ సాధన అవసరమని శ్రీకృష్ణ పరమాత్ముడు
చెప్తున్నారు.
శరణాగతము అనేది పరమాత్మను చేరుకునే రెండో మార్గం. శ్రీకృష్ణుడు ఇలా అంటారు, "అట్టి పరమభక్తుడు
అంత్యకాలమునందు యెగబలము చేత భృకుటి మధ్యమున ప్రాణములను స్థిరముగానిల్పి, నిశ్చలమైన మనస్సుతో స్మరించుచు దివ్యస్వరూపుడును, పరమపురుషుడును
ఐన పరమాత్మనే చేరును" (8.10). ఎప్పుడూ సంచరించే మనస్సును నియంత్రించే మొదటి
మార్గం కంటే ఈ మార్గం సులభంగా కనిపించినప్పటికీ దీనికి హృదయంలో పరమ భక్తి అవసరం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి