145. పునర్జన్మ గురించి పునరాలోచన






నాలో లీనమైన నా భక్తులకు పునర్జన్మ ఉండదనీ (8.16), పరమాత్మలో లీనం కానీ వారి జీవితం నిత్య దు:ఖదాయకంగా ఉంటుందని (8.15) శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పారు. అందువలన పునర్జన్మ అంటే ఏమిటో తెలుసుకోవటం అవసరం.

పునర్జన్మ అంటే మరణించిన తర్వాత మళ్లీ పుట్టడం అని సాధారణ అర్ధముగా చెప్పుకుంటాము. మరో విధముగా చుస్తే ఇది మన చుట్టూ ఉన్న కొత్త పరిస్థితి యొక్క పుట్టుకగా కూడా అర్థం చేసుకోవచ్చు.

రోజువారీ జీవితంలో మన చుట్టూ అనేక పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ పరిస్థితులలో మన ఇంద్రియాలు గ్రహించే తీరును బట్టి, మనం స్పందించే తీరును బట్టి తలెత్తే పర్యవసానాలు అనేక సరికొత్త పరిస్థితులకు దారి తీస్తాయి. ఇటువంటి చక్రీయ ప్రక్రియనే శ్రీకృష్ణుడు దు:ఖ వలయమని అంటారు. కానీ పరమాత్మను చేరుకున్న వారికి ఈ ఇంద్రియ స్పందనలు సముద్రంలో కలిసిన నదిలాగా మాయమవుతాయి. అందువల్ల మన ద్వారా కొత్త పరిస్థితులను సృష్టించే అవకాశం ఉండదు. అయితే అస్థిత్వము వాటిని సృష్టించడం కొనసాగించవచ్చు.

బాహ్య పరిస్థితులపై మనకు నియంత్రణ ఉండదు. కానీ మనలను మనము నియంత్రించు-కున్నప్పుడు ఆయా పరిస్థితులు మన మీద ఏ ప్రభావము చూపించలేక శక్తిహీనులుగా మారతాయి. మనం కేవలం సాక్షిగా మిగులుతాము. ఈ మార్పు సాధించే మార్గాన్ని పరమపదము అంటాము. ఈ పరమపదములో పురోగమించాలంటే మనము వీతరాగ దశకు చేరుకోవాలి. మనం మనచుట్టూ ఉన్న భవబంధాలను, ఆప్యాయత, అనురాగాలను, ద్వంద్వ స్పందనలను అధిగమించాలి (8.11). అలా చేయటం అంటే మన చుట్టూ ఉన్న వ్యక్తులు, పరిస్థితులు మీద ఏర్పడే ఆసక్తి-విరక్తులను అధిగమించటమే (7.27). తదుపరి దశలో ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని మనస్సును హృదయములో స్థిరముగా నిలిపి, నియంత్రించి పరమాత్ముని సన్నిధిని శరణుజొచ్చటం. నిత్య భగవన్నామ స్మరణతో గడపటం (8.12, 8.13). ఈ మార్గంలో ప్రయాణించిన వారు నిస్సందేహంగా తనను చేరుకోగలుగుతారని శ్రీకృష్ణ పరమాత్ముడు హామీ ఇస్తున్నారు (8.14).

మనం ఎదుర్కునే కష్టాలకు, బాధలకు మన చుట్టూ ఉన్న వాళ్లే కారణమని భావించి వారిని మార్చడానికి ప్రయత్నం చేస్తాము. వాస్తావానికి మన చుట్టూ ఉన్న వ్యక్తులు, పరిస్థితులు మనల్ని ప్రభావితం చేయలేనంతగా మనల్ని మనం మార్చుకోవటమే మనం ఎదుర్కొనే సమస్యలకు నిజమైన పరిష్కారం. అటువంటి దశకు చేరుకోవటమే పునర్జన్మకు తావులేని అవస్థ.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

37. అదే అర్జునుడు అదే బాణం

140. కర్మ అంటే ఏమిటి

141. శక్తి, పదార్థాల పొందిక