146. ఫోటాన్ మీద స్వారీ

 

మనిషికి ప్రతి ఉదయమూ ఓ కొత్త జీవితమే, సరికొత్త జననమే. ఈ విషయాన్ని వివరిస్తూ సృష్టికర్త  అయిన బ్రహ్మకు కూడా పగలు, రాత్రి ఉంటాయనీ అయితే వాటి వ్యవధి భిన్నంగా ఉంటుందని (8.17) శ్రీకృష్ణుడు చెప్తున్నారు. తెల్లవారుతూనే బ్రహ్మ సృష్టించిందంతా కనిపిస్తుంది. బ్రహ్మకు చీకటి పడేనాటికి మాయమవుతుంది (8.18). ఇది ఒక చక్రీయ ప్రక్రియ (8.19). గమనార్హం ఏమిటంటే కాలానుగుణంగా నడిచేదంతా చక్రీయమే.

అవ్యక్తమైన దానికంటే ఉన్నతమైన మరో అవ్యక్త, శాశ్వతమైన, పరమపదమైన, కాలచక్రం ప్రభావానికి అతీతమైన అవస్థ ఉంటుంది (8.20). విత్తనాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఈ శ్లోకాన్ని మరింత తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. విత్తనంలో అవ్యక్తరూపంలో ఉన్న మహా వృక్షం దాగి ఉంటుంది. విత్తనం నుండి చెట్టు, చెట్టు నుండి విత్తనం అన్న వలయం నిరంతరముగా సాగుతూనే ఉంటుంది. వాటన్నింటి వెనుక ఈ వలయాన్ని నడిపించే ఒక సృజనాత్మక శక్తి కూడా ఉంటుంది. కాలచక్రం పరిధి బయట ఉన్న ఈ సృజనాత్మక శక్తిని గుర్తించాలని శ్రీకృష్ణ పరమాత్ముడు సూచిస్తున్నారు.

 కాలచక్ర ప్రభావానికి అతీతమైనదాన్ని గుర్తించటం, అర్థం చేసుకోవటం మన మెదడు సామర్ధ్యానికి మించిన పని. ఈ సంక్లిష్టతను అర్థం చేసుకోవటానికి విజ్ఞాన శాస్త్రంలో ఉపయోగించే సాపేక్ష సిద్ధాంతం మనకు సహాయపడుతుంది. ఈ సిద్ధాంత ప్రకారము కాంతి వేగంతో ప్రయాణించే ఫోటాన్‌ పై మనం ప్రయాణిస్తుంటే సమయము నిలిచిపోతుంది. అంటే మన కాలెండర్‌ ప్రకారం ఫోటాన్‌ తన ప్రయాణాన్ని కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభించినా కూడా ఫోటాన్‌ యొక్క గడియారం ఇంకా పని చేయడం మొదలుపెట్టలేదు. ఫోటోను విషయంలో కాలం అన్నది వర్తించదు లేక కాలాతీతముగా ఉంటుంది.

 "సమస్త భూతములు (ప్రాణులు) ఆ పరమాత్మయుందే అంతర్గతములై ఉన్నవి. ఆ పరమాత్మ చేతనే ఈ జగత్తు అంతయు వ్యాపమై ఉన్నది. అట్టి పరమ పురుషుడు అనన్య భక్తి ద్వారా మాత్రమే లభ్యుడగును" అని శ్రీకృష్ణుడు చెప్పారు (8.22). పునర్జన్మకు తావులేని గమ్యాన్ని చేరాలనుకునే వారి అందరికీ ఇదే అంతిమ గమ్యస్థానం (8.21). మోక్షం సాధించిన వాళ్లకు జన్మ-పునర్జన్మ కలిగిన కాలచక్రము వర్తించదు. పరమాత్మను తదేక ధ్యానంతో సేవించటమే మోక్షసాధనకు మార్గం. అన్ని జీవులపై షరతులు లేని ప్రేమ ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుంది.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

37. అదే అర్జునుడు అదే బాణం

140. కర్మ అంటే ఏమిటి

141. శక్తి, పదార్థాల పొందిక