147. భిన్నత్వంలో ఏకత్వం

 

సత్యమూ, వాస్తవము, దేవుడూ ఒక్కటే. భగవత్‌ దర్శనం చేసుకున్న వాళ్లు ఆయన్ను వేర్వేరు భాషల్లో, వేర్వేరు పదాలతో, పేర్లతో పిలుస్తారు, కొలుస్తారు. క్రిస్మస్‌ పర్వదినాన జీసస్‌ క్రైస్ట్‌ యొక్క బోధనను గుర్తు చేసుకొని బైబిల్‌ గ్రంధం కూడా గీతోపదేశాన్ని ప్రతిధ్వనిస్తోందని అర్ధం చేసుకోవచ్చు.

సమత్వము అనేది భగవద్గితకు పునాది. సకల విషయాలను, మనుషులును (బంధువులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, శత్రువులు) మనోభావాలను (పొగడ్తలు, విమర్శలు) అన్నిటినీ సమదృష్టితో చూడాలన్నది శ్రీకృష్ణ పరమాత్ముని బోధన. ఏసు క్రీస్తు కూడా 'ఇతరులు మనపట్ల ఏ విధంగా వ్యవహరించాలని కోరుకుంటామో అదే విధంగా మనము కూడా ఇతరుల పట్ల వ్యవహరించాలి' అని చెప్పారు. మన యజమాని మన పట్ల ఎలా వ్యవహరించాలని కోరుకుంటున్నామో మనం కూడా మనకంటే దిగువన ఉన్న వారి పట్ల కూడా అదే విధంగా వ్యవహరించాలి. మన ఇరుగుపొరుగు వారు మనతో ఎలా వ్యవహరించాలని ఆశిస్తామో మనం కూడా వారితో అలానే వ్యవహరించాలి. ఈ చిన్నపాటి దృక్ఫధం మనల్ని సమత్వ దృష్టిని అలవర్చుకుని శిఖరాగ్రానికి చేర్చటంలో సహాయపడుతుంది.

అదేవిధంగా బైబిల్‌ గ్రంధంలో (మాథ్యూ 25:29) 'నిండుగా ఉన్న వాడికి సకలమూ దక్కుతుంది. లేని వారి దగ్గర ఉన్న ఆ కొంచము కూడా తీసుకొనబడుతుంది' అని చెప్పారు. దీన్ని అర్థం చేసుకోవటం క్లిష్టమైన పని. సాధారణంగా ధనవంతుల నుండి తీసుకుని పేదలకు పంచాలన్న బోధన వైపు మనం మొగ్గు చూపుతూ ఉంటాము. అయితే, ఇంద్రియాలపై ఆధారపడకుండా తనతో తాను సంతృప్తి చెందాలని భగవద్గీత నొక్కి చెప్పింది. స్థిత ప్రజ్ఞుడు, నిత్యం తృప్తి చెందేవాడు, ఆత్మావాన్‌, ఆత్మారమణ వంటి పదాలు ఈ అవగాహననే వ్యక్తం చేస్తున్నాయి. పుష్కలంగా లేదా నిండుగా ఉండటం అంటే మనతో మనం తృప్తిగా ఉండటం వల్ల కలిగే సమృద్ధి.  ఎన్నటికీ సంతృప్తి చెందని ఇంద్రియాలపై ఆధారపడినప్పుడు మనము ఎన్నటికీ తృప్తి చెందలేము. ఇంద్రియాలపై ఆధారపడటం మన ‘దారిద్య్రాన్ని’ పెంపొందిస్తుంది.

అన్ని సంస్కృతులలో ఇటువంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. సారాంశం ఏమిటంటే, ఒకే సత్యాన్ని జ్ఞానోదయం అయినవారు వారి కాలపు సందర్భం, శ్రోతల క్షమతలకు అనుగుణంగా వివిధ విధాల్లో చెప్పారు. ఆ బోధనలు కంఠస్థం చేయడం, బోధించిన వారిని గొప్పవారిగా చూడడం, వారి బోధనల కంటే అనుష్ఠానాలకు ప్రాథమికత ఇవ్వడం కంటే ఈ జ్ఞానోదయమైన వారు ఎలాగైతే తమలో తాము తృప్తి చెందారో, మనము కూడా స్వయంతో సంతృప్తి చెందాలి. ఏకత్వాన్ని గ్రహించడం ద్వారా అందరిని సమానంగా చూసుకోవడమే.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

37. అదే అర్జునుడు అదే బాణం

140. కర్మ అంటే ఏమిటి

141. శక్తి, పదార్థాల పొందిక